27 August, 2026 | 1:56 AM

హుస్సేన్ సాగర్‌లో పడిన సూడాన్ విద్యార్థి..

27-08-2026 12:00 AM
  1. రక్షించిన పోలీసులు
  2. కుటుంబసభ్యులకు అప్పగింత
  3. లేక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాసరావు

ముషీరాబాద్,ఆగస్టు 26(విజయక్రాంతి): హుస్సేన్ సాగర్లో ప్రమాదవశాత్తు పడిపోయిన సూడాన్ దేశానికి చెందిన 25 ఏళ్ల విద్యార్థిని సైఫాబాద్ పోలీస్ పెట్రోల్ కార్-1 సిబ్బంది, లేక్ పోలీస్ బృందం సకాలంలో స్పందించి సురక్షితంగా రక్షించారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 4.20 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా ఈ ఘటన  చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ మార్గ్లో గస్తీ నిర్వహిస్తున్న సైఫాబాద్ పోలీస్ పెట్రోల్ కార్-1 సిబ్బంది గ్రిల్ వద్ద నిలబడి హుస్సేన్ సాగర్ వైపు చూస్తున్న ఓ వ్యక్తిని గమనించారు.

అకస్మాత్తుగా అతను ప్రమాదవశాత్తు జారి సరస్సులో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తాడు సహాయంతో అతడిని బయటకు తీసి లేక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. లేక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాసరావు తన బృందంతో విచారణ చేపట్టగా, ఆ వ్యక్తి నజర్ ఆడమ్ బదావీ మహది, తండ్రి పేరు ఆడమ్ బదావీ, వయస్సు 25 సంవత్సరాలు, సూడాన్ పౌరుడు, విద్యార్థి అని వెల్లడించాడు.

ప్రస్తుతం రాజస్థాన్లోని అజ్మీర్లో భగవంత్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్లు తెలిపారు. వైద్య చికిత్స కోసం సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు, టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో నివసిస్తున్న తన సోదరుడి స్నేహితుడిని కలిసేందుకు వచ్చినట్లు పోలీసులకు వివరించాడు. మొబైల్ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉండటంతో దానిని సోదరుడి స్నేహితుడి ఇంట్లో ఉంచి హైదరాబాద్లోని ప్రాంతాలను చూసేందుకు బయటకు వచ్చినట్లు తెలిపారు. 

పోలీసులు అతని పాస్పోర్ట్, వీసాను పరిశీలించగా అవి చెల్లుబాటులో ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం అవసరమైన లాంఛనాలు పూర్తి చేసి, అతడిని టోలిచౌకిలోని సోదరుడి స్నేహితుడి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. సైఫాబాద్ పోలీస్ పెట్రోల్ కార్-1 సిబ్బంది, లేక్ పోలీస్ బృందం తక్షణమే స్పందించడం వల్ల ప్రాణనష్టం తప్పిందని పోలీసులు తెలిపారు.