సురవరం సేవలు చిరస్మరణీయం
ప్రపంచం గర్వించే వ్యక్తి సురవరం.. ఎంపీ మల్లు రవి
కంచుపాడు అభివృద్ధికి రూ.50 లక్షల ఎంపీ నిధులు
అలంపూర్, ఆగస్టు 26: పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సురవరం సుధాకర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. గద్వాల జిల్లా కంచుపాడులో బుధవారం నిర్వహించిన సురవరం ప్రథమ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం గర్వించే వ్యక్తి సురవరం అని కొనియాడారు.
తెలంగాణలోని ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కంచుపాడు అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
సురవరం లాంటి నాయకుడు మళ్లీ రావడం కష్టం: సంపత్ కుమార్
సురవరం సుధాకర్ రెడ్డి లాంటి నాయకుడు ఈ తరంలోనే కాదు.. రాబోయే తరాల్లో కూడా రావడం కష్టమని అలంపూర్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. సురవరం తనకు గురువులాంటి వారని, ఆయన ఆలోచనలు తనను రాజకీయంగా ముందుకు నడిపించాయని తెలిపారు. సురవరం ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు.కంచుపాడు అభివృద్ధిపై సురవరం చివరి క్షణం వరకు శ్రద్ధ చూపారని, ఆయన కోరిక మేరకు రూ.3 కోట్లతో బీటీ రోడ్డు, రూ.కోటి వ్యయంతో అత్యాధునిక పాఠశాల నిర్మాణానికి ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయని సంపత్ కుమార్ తెలిపారు. అంగన్వాడీ, మహిళా సంఘ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
మరో 5 నుంచి 10 ఇందిరమ్మ ఇళ్లను సురవరం జ్ఞాపకార్థం మంజూరు చేయిస్తానని ప్రకటించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు , చాడా వెంకటరెడ్డి ఇరువురు మాట్లాడుతూ .. ఎక్కడో మారుమూల పల్లె నుంచి జాతీయస్థాయి రాజకీయాలలో తనదైన శైలిలో ముద్ర వేశాడని ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల సంక్షేమ రాష్ట్ర చైర్మన్ సరిత తిరుపతయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, సురవరం అభిమానులు పాల్గొన్నారు. యువత కోసం ఏర్పాటు చేసిన సురవరం క్రీడా ప్రాంగణం, లైబ్రరీ, వసతి గృహాలను ప్రారంభించారు.






