calender_icon.png 10 May, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ప్రాణాలు బలిగొంటున్న ‘వడదెబ్బ’

24-04-2025 01:38:11 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): వడదెబ్బ కారణంగా మహబూబాబాద్ జిల్లాలో ప్రాణాలు వదులుతున్న రైతుల సంఖ్య రోజుకు పెరుగుతోంది. యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న పంట దిగుబడులు చేతికి అందవొస్తున్నాయి. ధాన్యం, మొక్కజొన్న నూర్పిడి చేసి , విక్రయానికి సిద్ధం చేయడానికి రైతులు కుటుంబ సభ్యులతో కలిసి రేయింబవళ్లు కష్టపడుతున్నారు. దీనితో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో వడదెబ్బకు గురై రైతులు తాము నమ్ముకున్న పంటల వద్ద ప్రాణాలు విడుస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాన్యం ఆరబోసి వడదెబ్బకు గురై మహిళా రైతు అనుమాండ్ల ప్రేమలత ఇటీవల మరణించింది. ఈ ఘటన మరువక ముందే మంగళవారం నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామంలో రైతు బిర్రు వెంకన్న తాను పండించిన వరి పంటను నూర్పిడి చేసి ధాన్యాన్ని ఆరబెట్టి నేర్పుతున్న క్రమంలో ధాన్యం రాశి పైనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఇద్దరు రైతులు వడదెబ్బ కారణంగా మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.

ఎండ దెబ్బ తగలకుండా నివారణ చర్యలు

వీలైనంతవరకు ఎన్నో సమయంలో బయటకు వెళ్లొద్దు. తప్పనిసరి అయితే ఎండ తగలకుండా గొడుగు, లేదంటే తలకు వస్త్రం ధరించాలి. కండ్లకు నలుపు రంగు అద్దాలను, తేలికపాటి కాటన్ దుస్తులను వేసవికాలం పూర్తయ్యేంతవరకు వినియోగించాలి. ఎండలో తిరిగి వచ్చిన వెంటనే చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ ఇతర చల్లటి పదార్ధాలు సేవించరాదు. ఎండాకాలంలో వీలైనంతవరకు కుండలో నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు సేవించాలి. డీహైడ్రేషన్కు గురికాకుండా రోజుకు కనీసం 4 నుంచి 6 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు ఎండలో తిరగకుండా నీడ పట్టునే ఉండాలి. అలసట, వాంతులు, విరోచనాలు అయినట్లయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే సమీప వైద్యులను సంప్రదించాలి. ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడితే వడదెబ్బకు గురికాకుండా కాపాడుకోవచ్చు.     

-డాక్టర్ అల్లం రమ, కేసముద్రం