13-10-2025 02:02:05 PM
న్యూఢిల్లీ: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్లచోరీ వ్యాఖ్యలపై సెట్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖాలయ్యాయి. బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాలలో రాహుల్ గాంధీ చేసిన ఓటర్ల జాబితా తారుమారు ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. అంతేకాకుండా రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవదని ధర్మాసనం పేర్కొంది.
ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకబోవాలని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సూచించింది. సముచితమని భావిస్తే, భారత ఎన్నికల సంఘం (ECI) వద్ద ఈ అంశాన్ని లేవనెత్తే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తాము పిటిషనర్ న్యాయవాది వాదనలు విన్నామని, ప్రజా ప్రయోజనం కోసం దాఖలు చేయబడిన ఈ పిటిషన్‌ను స్వీకరించడానికి నిరకరిస్తున్నామన్నారు. అలా సలహా ఇస్తే పిటిషనర్ ఈసీఐ(ECI) ముందు విచారణ కొనసాగించవచ్చని బెంచ్ ఉత్తర్వులో పేర్కొంది.
పిఐఎల్ పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది రోహిత్ పాండే వాదిస్తూ, ఈసీఐ ముందు ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. కానీ ధర్మాసనం ఈ విజ్ఞప్తితో సంతృప్తి చెందలేదు. చట్టం ప్రకారం తగిన పరిష్కారాలను పొందాలని పాండేను కోరింది. స్వతంత్ర ఆడిట్ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసే వరకు భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటర్ల జాబితాల సవరణ లేదా తుది నిర్ణయం నిలిపివేయాలని పాండే సుప్రీంకోర్టును కోరారు. ప్రజా ధృవీకరణ, పరిశీలనను సులభతరం చేయడానికి అందుబాటులో ఉన్న, యంత్రాలు చదవగలిగే, ఓసీఆర్(OCR)-కంప్లైంట్ ఫార్మాట్లలో ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఈసీఐకి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.