13-10-2025 03:52:57 PM
మందమర్రి,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కోల్ బెల్ట్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని సింగరేణి హై స్కూల్ ఎదురుగా ఉన్న కోల్ బెల్ట్ రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వ హించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి శ్రీరాంపూర్ వైపు వెళ్లే వాహనాలు ఇరువైపుల భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిళ్ళ శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షులు ముడారపు శేఖర్ లు మాట్లాడారు.
ఉత్పత్తి, ఉత్పాదక కులాలుగా ఉన్న బీసీలను ఎన్నో ఏళ్లుగా అణిచి వేయడమే కాకుండా హక్కుల ను కాలరాస్తున్న అగ్రవర్ణాలు, తమ కుట్రలు ఇకనైన మానుకుని బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల ని వారు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్య, ఉద్యోగ, చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించినపుడే బీసీ రాజ్యాధి కారం సాధ్యమవుతుందని, ఈ దిశగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ హక్కుల కోసం ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని, బీసీ హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలన్నారు.