13-10-2025 03:57:49 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మేళ్లమడుగు గ్రామంలో సోమవారం వట్టం నాగేశ్వరరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫర్నీచర్, గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు ఊళ్లో లేరు, గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించగా అప్పటికే పూర్తిగా దగ్దమైంది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కోరం కనకయ్య మెళ్లమడుగు గ్రామానికి వెళ్లి అగ్నిబాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి కొంత ఆర్ధిక సహాయం అందించారు.