13-10-2025 03:43:38 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు అన్యాయం చేసిందే గత బిఆర్ఎస్ ప్రభుత్వం అని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం శాసనసభ్యులు మందుల సామెల్ సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులను ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే బిఆర్ఎస్ పని అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను వంచించే ఇప్పుడు సానుభూతి నటిస్తున్నారని మండిపడ్డారు. కానీ నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఏ గ్రేడ్‌కు రూ. 2389, కామన్ రకానికి రూ.2369 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రవాణా, హమాలీలు, గోనె సంచుల కొరత లేకుండా చూడాలని అన్నారు.
రైతులు నాణ్యత ప్రమాణాల ప్రకారం, ధాన్యమును తాలు గింజలు, కల్తీ గింజలు, పొల్లు లేకుండా ఆరబెట్టుకొని తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని అన్నారు. రైతులు తమ ధాన్యమును ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తేవడానికి ముందుగానే పేరును కొనుగోలు కేంద్రం వద్ద నమోదు చేసుకొని ఆధార్ కార్డు, పట్టా దార్ పాస్ పుస్తకం తో పాటు బ్యాంకు ఖాతా నెంబర్ ఇవ్వాలని అన్నారు.