16 August, 2026 | 1:24 AM

కులగణన నిర్ణయం చారిత్రాత్మకం

16-08-2026 12:20 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్,ఆగస్టు 15(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణన నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. శనివారం విద్యానగర్‌లోని బీసీభవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జరిగిన సమావేశంలో 18 బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెంపు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ సబ్‌ప్లాన్, బడ్జెట్ పెంపు వంటి నిర్ణయాలకు కులగణన ఆధారంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి రావడం ద్వారా రిజర్వేషన్ల వర్గీకరణ, ప్రత్యేక సంక్షేమ పథకాల రూపకల్పన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు అవకాశం ఏర్పడుతుందన్నారు. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేయడంతో పాటు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం, విశ్వకర్మ యోజన వంటి పథకాలు అమలు చేయడం లాంటి చర్యలను ప్రస్తావించారు. విద్యా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి  పాల్గొన్నారు.