నాటుసారా తయారీపై నిఘా
ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాటుసారా తయారీ, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం దిగుమతిపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో అన్ని జిల్లాల డీసీలు, ఏసీలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్సైజ్ శాఖ పనితీరుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నదన్నారు. ప్రభుత్వ పెద్దలతో శుక్రవారం జరగాల్సిన సమావేశం చివరి నిమిషంలో రద్దయిందని, త్వరలో జరుగబోయే సమావేశానికి అన్ని వివరాలతో హాజరుకావాలని జిల్లాల అధికారులకు సూచించారు.
పలువురు డీసీలు, ఏసీలు ఆశించిన స్థాయిలో విధులు నిర్వహించడం లేదని, ఇక నుంచి చురుగ్గా పని చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో బీర్ల కొరత ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని, కింగ్ ఫిషర్ బీర్లు అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటిని మద్యం దుకాణదారులు పక్కదారి పట్టిస్తున్నారని, బీర్లను ఎక్కువ ధరకు అమ్మకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ అజయ్, బ్రూవజరీస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహం పాల్గొన్నారు.






