‘అధికార పార్టీ కొమ్ముకాస్తున్న సీఐ’ సస్పెండ్ చేయాలంటూ జనగామలో బాధితుల ధర్నా
జనగామ, జూన్ 14(విజయక్రాంతి): జనగామ సీఐ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ కుటుంబం ఆరోపించింది. పోలీసుల తీరును నిరసిస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి చెందిన బీజేపీ నాయకుడు ఈర్ల అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం తమ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారని చెప్పారు.
దాడితో తన సోదరుడి భుజం ఎముక విరిగిందని, తన తల్లి దుస్తులు చింపి మరీ దాడి చేశారని ఆవేదన చెందారు. ఈ విషయంలో నిందితులను సీఐ కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమపై హత్యాయత్నం చేసిన వారిని చిన్నపాటి సెక్షన్లు విధించి వదిలేశారని, తిరిగి తమపైనే ఎస్‌టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. నిందితుల వంత పాడుతున్న సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని సీపీని డిమాండ్ చేశారు.






