calender_icon.png 13 September, 2024 | 12:28 AM

ఆత్మకూర్(ఎస్) ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి

04-07-2024 03:27:15 AM

సూర్యాపేట, జూలై 3 (విజయక్రాంతి): హాస్టల్‌లో పడుకున్న విద్యార్ధి తెల్లవారేసరికి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్)లోని ఎస్సీ హాస్టల్‌లో బుధవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన విద్యార్థి మేల్లం శ్యామ్‌కుమార్ (11) ఆత్మకూర్ (ఎస్) ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ మోడల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి అందరూ విద్యార్థులతో కలిసి పడుకున్నాడు.

అర్ధరాత్రి దాటిన తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చి వాంతి చేసుకున్నాడు. ఇదే విషయాన్ని వాచ్‌మెన్‌కు, తోటి విద్యార్థులకు చెప్పగా ఏమీ కాదులే.. పడుకో అని చెప్పడంతో పడుకున్నాడు. ఉదయం అందరూ నిద్రలేచే సరికి శ్యామ్‌కుమార్ అపస్మారక స్థితిలో ఉండగా విషయాన్ని హాస్టల్ వార్డెన్ పెరుమాళ్ల రవికి తెలిపారు. వెంటనే వాచ్‌మెన్ ద్వారా సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి అప్పటికే మృతిచెం దినట్టు నిర్దారించారు.

శ్యామ్‌కుమార్ తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా, పెద్దమ్మ పీ ఉమ సంరక్షిస్తూ వస్తుంది. విద్యార్థి మృతికి కారణం రాత్రి మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు కాలుకు విషపురుగు కరిచినట్టు అధికారుల ద్వారా తెలుస్తుంది. విద్యార్థి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యార్థి మృతిపై సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు, డీఎస్పీ జీ రవి హాస్టల్‌కు వెళ్లి విచారణ చేశారు. తదుపరి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్టు తెలిపారు.

శ్యామ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి: ఎస్‌ఎఫ్‌ఐ

శ్యామ్‌కుమార్ మృతిపై అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని ఏరియా హాస్పిటల్ ఎదుట విద్యార్ధి బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ.. విద్యార్ధి మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని అన్నారు. విద్యార్ధి మృతదేహాన్ని బంధువులకు సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్‌కు తరలించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థి మృతికి కారణమైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు.