- రూ.7.857 కోట్ల ప్రజాధనం వృథా
- నాణ్యతా లోపంతో బీటీపీఎస్ నిర్మాణం!
- నిర్వహణలోనూ నిర్లక్ష్యమే
- ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోపాలు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 3(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడగుంట ప్రాంతంలో గోదావరి నదీ తీరాన నిర్మించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో ఒక్కొక్కటిగా లోపాలు బయటపడుతున్నాయి. మొదట సూపర్ క్రిటికల్ నిర్మాణం కోసం హర్యానకు చెందిన ఇండియాబుల్స్ కంపెనీ ముందుకొచ్చింది. కానీ ఆ ప్రదేశంలో సూపర్ క్రిటికల్ కాదని ఆ కంపెనీ నిరాకరించి, వెనక్కి తగ్గింది. అయినా కూడా వినిపించుకోని మాజీ సీఎం కేసీఆర్ బీహెచ్‌ఈఎల్ సంస్థతో కలిసి నిర్మాణానికి పూనుకుంది.
దేశంలోని థర్మల్ కర్మాగారాలను సూపర్ క్రిటికల్ వైపు పరుగులు తీయిస్తుంటే తెలంగాణలో నాసిరకం పరికరాలతో కూడిన థర్మల్ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారంటూ ఆనాడే విద్యుత్ నిపుణులు, కార్మిక సంఘాల పెద్దలు విమర్శలు గుప్పించారు. అయినా కూడా వినిపించుకోని నాటి సీఎం కేసీఆర్ తన క్లాస్‌మేట్ అయిన బీహెచ్‌ఈఎల్ చైర్మన్‌కు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే బీటీపీఎస్ నిర్మాణాన్ని చేపట్టారని ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలు నేడు నిజమవుతున్నాయి.
రూ.7,857 కోట్లతో కర్మాగారం నిర్మాణం
2015 మార్చిలో నాటి సీఎం కేసీఆర్ 270 యూనిట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లతో 1080 మెగావాట్ల విద్యుత్ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. సుమారు ఏడు సంవత్సరాలకుగానీ కర్మాగారం పూర్తి కాలేదు. ఐదు సంవత్సరాల తర్వాత 2020 జూన్ 5న మొదటి యూనిట్(270మెగావాట్లు), అదే సంవత్సరం డిసెంబరు 2వ యూనిట్, 2021మార్చి 26న 3వ యూనిట్, 2022 జనవరి 9న 4వ యూనిట్‌ను పూర్తి చేశారు.
15వేల టన్నుల బొగ్గు కాల్చితేనే కరెంట్
బీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 13 వేల నుంచి 15వేల టన్నుల బొగ్గును కాల్చుతున్నారు. అయినా పూర్తిస్థాయి సామర్థ్యంలో విద్యుత్‌ను ఉత్పత్తి కావడం లేదు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఇందనమైన బొగ్గు నిల్వలకు నేటికి షెడ్లు లేవు. ఆరుబయట లోతట్లు ప్రాంతంలో బొగ్గును నిల్వ ఉంచడంతో వర్షాకాలంలో గోదావరి నీటితో తడిసిపోతుంది. తడిసిన బొగ్గును మండించేందుకు అధిక మొత్తంలో ఆయిల్‌ను వినియోగిస్తున్నారు. దీంతో బొగ్గు ఖర్చుతో పాటు ఆయిల్‌కు అదనపు ఖర్చు చేయాల్సి వస్తున్నది. అయినా కూడా 60 నుంచి 75శాతం మాత్రమే విద్యుత్తును గ్రిడ్‌కు పంపుతున్నారు.
దేశంలోని కర్మాగారాల కంటే అధిక ఖర్చు
ఇటీవల ఈ కర్మాగారం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు నియమించిన జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిషన్ కూడా దేశంలోని అనేక థర్మల్ విద్యుత్ కర్మాగాలతో పోలిస్తే బీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అధిక ఖర్చు అవుతున్నదని తేల్చింది. కమిషన్ సేకరించిన వివరాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 సంబంధించి బీటీపీఎస్‌లో ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.6.03 ఖర్చు అవుతుందని జెన్‌కో అధికారులు అంచనా వేశారు. భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో యూనిట్ ఉత్పత్తికి రూ.4.89 ఖర్చు అవుతుంది.
2023 ఆర్థిక సంవత్సరలో కేటీపీపీలో 822.44 కోట్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తికి 48.14 లక్షల టన్నుల బొగ్గును కాలిస్తే, బీటీపీఎస్‌లో 1080 సామర్థ్యం కల్గిన కర్మాగారంలో 695.39 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి 52.30 లక్షల టన్నుల బొగ్గును మండించారు. దీన్ని బట్టి కేటీపీపీలో యూనిట్‌కు బొగ్గు 590 గ్రాములు వాడితే, బీటీపీఎస్‌లో 750 గ్రాములు వాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా థర్మల్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం సగటున 640 గ్రాములు మాత్రమే ఉంటే బీటీపీఎస్‌లో మాత్రం 110 గ్రాములు అధికంగా ఉన్నట్లు తేలింది. దీంతో తెలంగాణ విద్యుత్ పంపిణీ(డిస్కం)లపై ఆర్థికభారం పడుతోంది.
నాసిరకం బొగ్గుతో అంతరాయం
భద్రాద్రి కర్మాగారానికి నాణ్యతలేని బొగ్గును సరఫరా చేస్తున్నారు. ఫలితంగా పూర్తిస్థాయి విద్యుత్తు ఉత్పత్తి కావడం లేదు. ఈ విషయమై ఏకంగా సింగరేణికి జెన్‌కో యాజమాన్యం లేఖ రాసిందంటే పరిస్థితి ఎలా ఉందో తేటతెల్లమవుతోంది. పూర్తి స్థాయి సామర్థ్యం 1080 మెగావాట్లలో కనీసం 80శాతం ఉత్పత్తి చేసినా ఖర్చు తగ్గుతుంది. నాసిరకం బొగ్గు కారణంగా 70 శాతం కూడా ఉత్పత్తి కావడం లేదు. తరచూ బాయిలర్ ట్యూబ్ లీకులతో విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది.
పొంచి ఉన్న మరో ముప్పు
బీటీఎస్‌ను గోదావరి నది ఒడ్డున నిర్మించారు. గోదావరిలో వరదలు వస్తే కర్మాగారం చుట్టూ నీరు నిలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే దాని బ్యాక్ వాటర్‌తో కర్మాగారానికి ముంపు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ముంపును అడ్డుకోవాలంటే కరకట్ట నిర్మాణం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. తాజాగా బీటీపీఎస్ 1వ యూనిట్‌కు చెందిన జీటీ ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగు పడి దగ్ధం కావడం ప్రతీ ఒక్కరిని విస్మయానికి గురిచేస్తోంది. పిడుగులు పడకుండా ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌పై లైటింగ్ ఎరెక్టర్ (ఎల్‌ఏ)ను అమర్చుతారు. ఎల్‌ఏలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా పిగుడుపడడంతో నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుస్తున్నది.