22-09-2025 03:30:24 PM
2024-25 నికర లాభాల నుంచి 34% వాటా పంపిణీ కి నిర్ణయం
హైదరాబాద్ ప్రజా భవన్ లో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షల ప్రయోజనం..
పెద్దపల్లి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కారు తీపి కబురు చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరం సాధించిన నికర లాభాల నుంచి కార్మికులకు ఆనవాయితీగా ఈసారి 34 శాతం వాటాను ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సోమవారం సింగరేణి సంస్థ సీఎండీ బలరాం నాయక్(Singareni CMD Balaram Naik) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు హాజరయ్యారు. కార్మిక సంఘాలతో చర్చల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ యేడు 34 శాతం లాభాల వాటా చెల్లించనున్నట్లు ప్రకటించారు. సంస్థ సాధించిన నికర లాభాలు రూ. 2360 కోట్ల నుంచి 34 శాతం వాటాగా రూ.819 కోట్లు కార్మికులకు పంపిణీ చేస్తామని తెలిపారు.
అంటే ఒక్కో కార్మికునికి సగటున రూ.195610ల ప్రయోజనం చేకూరనుంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5500 చెల్లిస్తామని తెలిపారు. కాగా, సంస్థ సాధించిన వాస్తవ లాభాలు రూ.6394 కోట్ల నుంచి సంస్థ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా రూ.4034 కోట్లు పక్కనపెట్టినట్లు తెలిపారు. అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ లాభాలు రూ.4701 కోట్ల నుంచి సంస్థ ప్రయోజనాల కోసం రూ.2289 కోట్లు పక్కనపెట్టి మిగతా రూ.2412 కోట్ల లాభాలపై 33 శాతం వాటాగా కార్మికులకు చెల్లింపులు చేశారు. ఈసారి కూడా వాస్తవ లాభాల నుంచి వాటా చెల్లిస్తే బాగుండేదని కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.