22-09-2025 04:40:18 PM
బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్
రేగొండ,(విజయక్రాంతి): రైతుల సంక్షేమం పేరుతో గెలిచి వారి వ్యవసాయ అవసరాలను తీర్చలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ డిమాండ్ చేశారు.సోమవారం మండలంలోని రైతులు పిఎసిఎస్ గోదాం వద్ద యూరియా కోసం నిరసనకు దిగగా వారి పక్షాన బిఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. సోమవారం మండల కేంద్రానికి యూరియా వస్తుందని తెలియడంతో రాత్రి ఒంటిగంట నుండే మండలంలోని వివిధ గ్రామాల రైతులు పిఏసీస్ గోదాం వద్ద నిద్రాహారాలు మాని క్యూలో ఉన్నారు. దీంతో గోదాంకు 400 యూరియా బస్తాలు మాత్రమే రాగా యూరియా అందని రైతులు నిరసనకు దిగారు.
ఈ క్రమంలోనే బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రైతుల పక్షాన నిలబడి వ్యవసాయ అధికారులను యూరియాను ఎందుకివ్వరంటూ ప్రశ్నించారు. దీంతో వ్యవసాయ అధికారులకు స్థానిక పోలీసులకు రైతులు, బిఆర్ఎస్ నాయకుల మధ్య కొంత గడబిడ నెలకొంది. దీంతో రైతులు, బిఆర్ఎస్ నాయకులు కలిసి పరకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై యూరియా ఇవ్వాలంటూ బైఠాయించి ధర్నా చేపట్టారు.వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ మాట్లాడుతూ.... రైతులకు న్యాయం చేయలేని అసమర్ధ రేవంత్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలాని డిమాండ్ చేశారు.
దేశానికి వెన్నెముక లాంటి రైతును అరి గోస పెడుతూ తను మాత్రం రాజ భోగాలు పొందుతున్నాడని విమర్శించారు. రైతులు రాత్రి ఒంటి గంట నుండి పడిగాపులు కాస్తే ఒక్క బస్తా కూడా ఇవ్వకుండా రైతులపై జులుం చూపెడుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రైతులకు తగినంత యూరియాను అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు సామల పాపిరెడ్డి, బండి రమేష్, బూర్గుల ప్రభాకర్, భూక్య నాయక్ ,రైతులు, తదితరులు పాల్గొన్నారు.