calender_icon.png 22 September, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండలో జైన శాసనం

22-09-2025 03:34:47 PM

వెలుగులోకి తెచ్చిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు రాగి మురళి, చిక్కుల యాదగిరిల అన్వేషణలో కొత్త జైనశాసనం సోమవారం వెలుగుచూసింది. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అమ్మగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న అన్నేశ్వరమ్మ గుట్టమీద చెక్కివున్న ‘జినపాదాల’కు మూడువైపుల చుట్టు తెలుగన్నడం లిపిలో, కన్నడ భాషలో ‘జినబ్రహ్మయోగి పాద చారుకీర్తి’ అనే లఘు శాసనం చెక్కివుంది. గతంలో లభించిన ఇటువంటి శాసనాలలో కేవలం ‘జినబ్రహ్మజోగి’ అని మాత్రమే వుంది. చరిత్ర బృందం ‘జినబ్రహ్మయోగి పాద చారుకీర్తి’ అని ఉన్న శాసనాన్ని తొలిసారి గుర్తించింది. జైనమతం ప్రకారం ప్రస్తుత అవసర్పిణి యుగంలో ధర్మనాథుడు జైనతీర్థంకరులలో 15వ వాడు. అన్ని కర్మలనుంచి విముక్తుడైన సిద్ధుడు ధర్మనాథుడు. శిఖర్జీలో మోక్షం పొందాడు.

హేమచంద్రుడు సంస్కృతంలో రాసిన జైనమత గ్రంథం ‘త్రిషష్టి శలాక పురుష చరిత్ర’లో ధర్మనాథుడు పేర్కొనబడ్డాడు. జైనసన్యాసి జినసేనాచార్యుడు ‘మహాపురాణం’లో ధర్మనాథ తీర్థంకరుని ‘జినబ్రహ్మజోగి’ (జైనబ్రహ్మయోగి)గా పేర్కొన్నాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాతగూడూరు బయట ఒక రాతిగుండుమీద అరుదుగా అగుపించే జైనతీర్థంకరుడు ధర్మనాథుని శిల్పం చెక్కివుంది. తలపై త్రిస్తరఛత్రం వుంది. అతనికి కుడిపక్కన తీర్థంకరుని లాంఛనం వజ్రం చెక్కివుంది. రాతి గుండుమీద పాదాలు వున్నాయి. పాదాల ముందు 12వ శతాబ్దపు తెలుగన్నడలిపిలో జినబ్రహ్మ అని చెక్కిన లేబుల్(నామ) శాసనముంది. హన్మకొండ జిల్లా కాజీపేటలోని మడికొండ, మెట్టుగుట్ట మీద జైనమతబసది ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మెట్టుగుట్ట మీద ‘జినబ్రహ్మజోగి’ లఘుశాసనం, ధర్మనాథుని ప్రతిమ, పాదాలు వెలుగు చూసాయి.అన్నీశ్వరమ్మగుట్ట శాసనం తెలంగాణాలో మూడవది.