08-07-2025 01:52:36 AM
- హైడ్రా ప్రజావాణికి కబ్జా ఫిర్యాదుల వెల్లువ
- పరిష్కరించాలని కమిషనర్ రంగనాథ్ ఆదేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): కబ్జాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను స్వీకరించిన కమిషనర్ ఏవీ రంగనాథ్, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని ఫిర్యాదులకు సంబంధించి గూగుల్ మ్యాప్స్ ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని అప్పటికప్పుడే పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గాజులరామారం, కుత్బుల్లాపూర్, సిద్ధివినాయక నగర్‌లోని 102 ప్లాట్ల లేఅవుట్‌లో 30 అడుగుల వెడల్పు ఉన్న రహదారిని ఎదురుగా ఉన్న ప్లాట్ల యజమానులు కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెంగిచెర్ల, బోడుప్పల్, చిన్న క్రాంతి కాలనీలో సుమారు 1800 గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు నకిలీ ప్లాట్ నంబర్లు వేసి ఆక్రమించారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్కు స్థలాన్ని కాపాడాలని కోరారు. వీటితోపాటు మరిన్ని ఫిర్యాదులొచ్చాయి. ఈ ఫిర్యాదులన్నింటిపైనా వెంటనే విచారణ చేపట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు.