08-07-2025 12:20:45 PM
ఓర్వలేక చౌకబారు విమర్శలు
కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు సుందరి వెంకటేశ్వర్లు ఖండన
కోదాడ: కోదాడ అభివృద్ధి కొరకు 2వేల కోట్లు మంజూరు చేయించి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్న ఉత్తమ్ దంపతులపై ఓర్వలేక చౌకబారు విమర్శలు చేయడం మాజీ ఎమ్మెల్యే స్థాయి కాదని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు సుందరి వెంకటేశ్వర్లు అన్నారు. కోదాడ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే చౌకబారు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోదాడను గంజాయి అడ్డాగా మార్చింది ఎవరో అందరికీ తెలుసు అని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే హయాంలో నియోజకవర్గంలో శాండ్, ల్యాండ్, మట్టి మాఫియా చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్యేగా పద్మావతి ఎన్నికైన రోజు నుంచి నియోజకవర్గంలో గంజాయి ఆచూకీ లేకుండా చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. పోలీసులు ఎన్నో సందర్భాల్లో గంజాయిని పట్టుకొని కేసులు నమోదు చేయడమే నిదర్శనమన్నారు.
ఎమ్మెల్యేగా పద్మావతి హయంలో నియోజకవర్గం శాంతియుతంగా ఉందన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, మంచి పనులు చూసి ఓర్వలేక మల్లయ్య ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతులపై విమర్శలు చేసే స్థాయి మల్లయ్యకు లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అవుతాయన్నారు.