08-07-2025 12:35:36 PM
హైదరాబాద్: కాంగ్రెస్(Congress) అరాచక పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. సోమాజీగూడలో ప్రెస్ క్లబ్(Somajiguda Press Club)లో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ ప్రజలను మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) బేసిన్ల నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ లేదని విమర్శించారు. బహిరంగ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరితే మేం వచ్చాం.. సవాలు విసిరిన రేవంత్ రెడ్డి ఇక్కడకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి రాకపోతే.. మంత్రులైనా వస్తారని భావించామని చెప్పారు. మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటే అన్నారు. బహిరంగచర్చకు రావాలని సీఎంకు మరోసారి చెప్తున్నా మన్నారు. కొత్త తేదీ, ప్రదేశం రేవంత్ రెడ్డి చెప్తే తప్పకుండా వస్తామన్నారు. అసెంబ్లీలో చర్చించేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నామని, పూర్తిగా మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధం అన్నారు. మైకులు కట్ చేయకుండా మాట్లాడనిస్తే.. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని తెలిపారు.
నోటికొచ్చిన 420 హామీలు ఇచ్చి.. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గత 18 నెలలుగా ప్రజలకు చేసిందేమి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం చేతకాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే.. ఆనాటి ఎమర్జెన్సీ రోజులు తలపించేలా దళితులు, గిరిజనులు, పేదలపై దాడులు చేస్తూ ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సోషల్ మీడియాలో ఒక రీట్వీట్ చేస్తే శశిధర్ గౌడ్ (నల్లబాలు) ను జైల్లో పెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్దకు భారీగా బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) శ్రేణులు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలంటూ నేతలు నినాదాలు చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ఎదుట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.