ఖాకీ బట్టలు విప్పేసి రండి
- రాజకీయంగా తేల్చుకుందాం..
- ఐపీఎస్ అసోసియేషన్‌కు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్
- క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు
- నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా.. వెనక్కి తగ్గేదే లేదు
- కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటే మీకు గౌరవం ఉంటుంది
- డిజీపీ స్వతంత్రంగా లేరు.. రేవంత్ డైరెక్షన్‌లోనే నడుస్తున్నరు..
- దమ్ముంటే చర్చకు రండి.. మీ బండారం బయటపెడుతా: కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 31 (విజయక్రాంతి): తెలంగాణలో ఖాకీ వర్సెస్ ఖద్దర్ మధ్య రాజుకున్న వివాదం తారాస్థాయికి చేరింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, రాష్ట్ర పోలీసు యంత్రాంగం మధ్య జరుగుతున్న మాటల యుద్ధం శనివారం మరింత ముదిరి పాకాన పడింది. తనపై ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఖండన తీర్మానాన్ని కౌశిక్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసు ఉన్నతాధికారుల తీరుపై విరుచుకుపడ్డ ఆయన.. ‘నేను అన్న మాటలకు కట్టుబడి ఉన్నా. ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గేదే లేదు.
ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని తేల్చిచెప్పారు. యూనిఫామ్ గౌరవాన్ని కాపాడలేకపోతే ఖాకీ దుస్తులు విప్పేసి, కాంగ్రెస్ కండువాలు కప్పుకుని రాజకీయ క్షేత్రంలోకి రావాలని ఐపీఎస్ అసోసియేషన్‌కు బహిరంగ సవాల్ విసిరారు.
అసలేం జరిగింది..
కరీంనగర్ సీపీ గౌష్ ఆలంపై మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో ఐపీఎస్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేయడం, కేసులు నమోదు కావడంతో శుక్రవారం కౌశిక్‌రెడ్డి దిగొచ్చారు. ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్‌లోనే అలా మాట్లాడాను.. ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి, ఉద్దేశపూర్వకం కాదు అంటూ వీడియో విడుదల చేసి మెట్టు దిగారు. దీంతో ఈ ఎపిసోడ్ ముగిసిందని అంతా భావించారు.
కానీ, సీన్ కట్ చేస్తే శనివారం నాటికి కౌశిక్‌రెడ్డి స్వరం మళ్లీ పెరిగింది. ఈసారి వ్యక్తిగతంగా ఒక ఆఫీసర్‌ని కాకుండా, మొత్తం ఐపీఎస్ అసోసియేషన్‌నే టార్గెట్ చేశారు. తన క్షమాపణ కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితమని, పోలీసుల రాజకీయ పక్షపాతంపై కాదని చెప్పకనే చెప్పారు. ‘నేను అన్న మాటలకు కట్టుబడి ఉన్నా.. క్షమాపణ చెప్పేదే లేదు’ అంటూ శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
సీఎం డైరెక్షన్‌లోనే డీజీపీ..
రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి స్వతంత్రంగా తన విధులను నిర్వర్తించడం లేదని, సీఎం రేవంత్‌రెడ్డి రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్నారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ‘పోలీస్ బాస్.. రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో యాక్టింగ్ చేస్తున్నారు’ అని విమర్శించారు. రాష్ర్టంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, దీనికి పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకులను అణచివేయడమే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే రండి.. ఎక్కడో తేల్చుకుందాం..
ఐపీఎస్ అధికారులకు నిజాయితీ, ధైర్యం ఉంటే తనతో చర్చకు రావాలని కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. ఏసీ గదుల్లో కూర్చొని ప్రకటనలు ఇవ్వడం కాదు. దమ్ముంటే రండి.. బహిరంగ చర్చకు నేను సిద్ధం. పోలీసులు ఏ విధంగా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో ఆధారాలతో సహా నిరూపిస్తా. తప్పు ఎవరిదో ప్రజల ముందే తేల్చుకుందాం’అని హెచ్చరించా రు. మొత్తానికి కౌశిక్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో పోలీసువర్గాల్లో, రా జకీయ వర్గాల్లో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.
మీరు పోలీసులా.. కాంగ్రెస్ కార్యకర్తలా..
రాష్ర్టంలో పోలీసులు రాజ్యాంగం ప్రకారం, చట్టప్రకారం నడుచుకోవడం లేదని, పూర్తిగా అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మీకు యూనిఫామ్ మీద, ఆ స్టార్ల మీద గౌరవం ఉంటే నిష్పక్షపాతంగా పనిచేయండి. అంతేకానీ, కాంగ్రెస్ నేతల ఇళ్లలో పనిమనుషుల్లా వ్యవహరించ వద్దు. మీ తీరు చూస్తుంటే పోలీసుల్లా అనిపించడం లేదు.
అందుకే చెబుతున్నా.. ఆ డ్రెస్సులు(పోలీసు యూనిఫామ్స్) విప్పేసి రండి.. రాజకీయంగానే తేల్చుకుందాం’ అని ఎద్దేవా చేశారు. శేరిలింగంపల్లిలో తనపై, బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి జరిగినప్పుడు పోలీసులు చోద్యం చూశారని, ఇప్పుడు తాను ప్రశ్నిస్తే ఐపీఎస్ అసోసియేషన్‌కు ఎందుకు ఇంత ఉలుకు అని నిలదీశారు.
అప్పుడు మీ సంఘం నిద్రపోయిందా..
ఐపీఎస్ అసోసియేషన్ నైతికతను ప్రశ్నిస్తూ కౌశిక్‌రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గతం లో పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ కాన్వాయ్‌ని తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టినప్పుడు ‘మీ అసోసియేషన్ ఎక్కడికి వెళ్లింది. దళిత సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై పట్టపగలే దాడులు జరిగినప్పుడు మీ గొంతు ఎందుకు లేవలేదు.. అప్పుడు మీరంతా ఎక్కడ పడుకున్నారు’ అని ఘాటుగా ప్రశ్నించారు. అప్పుడు వినిపించని గొంతులు.. ఇప్పుడు తమ వైఫల్యాలను ఎత్తిచూ పుతుంటే ఎందుకు లేస్తున్నాయని మండిపడ్డారు.






