29-07-2025 12:12:34 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ: జూలై 28 (విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుండి వచ్చిన అర్జీలను పెండింగ్ లో లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. ఋసోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులు, పలువురు తహసీల్దార్లతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు తమ అర్జీలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ప్రజలు అందజేసిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజలు 283 వినతులను అందజేశారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ ఆయా శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ప్రజావాణి అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, హాస్టల్స్ తనిఖీ, పర్యవేక్షణ, తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఇటీవలి వరకూ హాస్టల్స్ తనిఖీ చేసినప్పుడు అక్కడ గుర్తించిన అంశాలు, సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావా లన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు తహసీల్దార్లతో కలెక్టర్ మాట్లాడారు. పజావాణి దరఖాస్తు సమర్పించిన వారికి రిసిప్ట్ ను ఆలస్యం లేకుండా అందించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సాఫీగా వినతులను సమర్పించే విధంగా సిబ్బందిని కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, డిఆర్డిఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, జిల్లా అధికారులు, పలువురు తహసిల్దార్లు పాల్గొన్నారు.