12 March, 2026 | 7:34 AM

రుణాలు ఇచ్చేందుకు చొరవ చూపాలి

12-03-2026 12:33 AM
  1. ఇందిరమ్మ గృహాలకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చి ప్రోత్సహించాలి 
  2. కలెక్టర్ చంద్రశేఖర్

నల్లగొండ టౌన్, మార్చి 11 : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు పంట రుణాలతోపాటు, స్వయం సహాయక మహిళ సంఘాలకు ,ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు రుణ పంపిణీలో చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశo లో ఆయన మాట్లాడారు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తున్నప్పటికీ లబ్ధిదారు ముందుగా బేస్మెంట్ వరకు నిర్మించుకోవలసి ఉన్నందున, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని,డిసిసి బ్యాంక్ మేనేజర్లు చొరవ చూపించాలని కోరారు.

ఇందిర మహిళ శక్తి కార్యక్రమం కింద స్వయం సహాయక మహిళా సంఘాల వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చినట్లయితే ఎక్కువమంది గ్రూప్ సభ్యులు రుణ సౌకర్యం పొంది లాభపడేందుకు అవకాశం ఉందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

జిల్లాలో దాన్యంతో పాటు ,వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున పండించడం జరుగుతున్నదని, అనువైన ప్రదేశాలలో కోల్ స్టోరేజ్ లు, ఆహార ఉత్పత్తులు నిల్వ ఉంచుకునేందుకు ఉండే అవకాశాలను పరిశీలించి వారికి రుణ సౌకర్యం అందించాలని, డిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో స్థలాలను గుర్తించి గోడౌన్ నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.

రబీ దాన్యం కొనుగోలు ప్రారంభమవుతున్న దృష్ట్యా పిఎసిఎస్ ల ద్వారా నిర్వహించే ధాన్యం కొనుగోలుకు సంబంధిత సొసైటీలు ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈవో శంకర్రావు మాట్లాడుతూ 1917 లో ప్రారంభమైన నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 108 సొసైటీలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని, 1000 కోట్ల అభివృద్ధిని సాధించిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన డిపాజిట్లు, రుణాలు, రైతులకు, గృహ నిర్మాణా నికి, విద్యార్ణాలు, వ్యక్తిగత రుణాలు, తదితర రంగాలలో ఇచ్చిన రుణాల అంశాలను వివరించారు జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, యాదాద్రి, భువనగిరి జిల్లా, సూర్యాపేట డిసిఒలు రమణ, ప్రవీణ్, డిసిసి బ్యాంకు డిడిఎం తదితరులు ఉన్నారు.