10 June, 2026 | 2:49 AM

ప్రణాళికాబద్ధంగా అడుగులు

10-06-2026 12:37 AM
  1. భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధి
  2. స్థిరమైన, పర్యావరణహిత పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం
  3. పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు
  4. ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి) : భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ‘ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవానికి  ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఐటీ, లైఫ్ సైన్సెస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, డీప్-టెక్ వరకు తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పరిశ్రమ 4.0 విప్లవంలో భాగంగా దూసుకొస్తున్న ఆటోమేషన్, డీప్-టెక్ సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట్రంలో కాంప్రహెన్సివ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అదే సమయంలో... భవిష్యత్తు తరాలకు మేలు జరిగేలా స్థిరమైన, పర్యావరణహిత పారిశ్రామిక వృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు.

రాబోయే రోజుల్లో పారిశ్రామికాభివృద్ధి అనేది కేవలం భూమి, మూలధనంపైనే కాకుండా మేధో సంపత్తి, నాలెడ్జ్ ఎకానమీ ఆధారంగానే సాధ్యమవుతుందన్నారు. అందుకోసం పరిశ్రమల అవసరాలకు, విద్యాసంస్థల శిక్షణకు మధ్య ఉన్న స్కిల్ గ్యాప్‌ను పూడ్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగానే  తెలంగాణను స్కిల్ క్యాపిటల్‌గా మార్చాలనే సంకల్పంతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిని కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈలను మరింత ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ‘ఎంఎస్‌ఎంఈ పాలసీ’ని తీసుకొచ్చామన్నారు.

పారిశ్రామికవేత్తలకు 2017 నుంచి చెల్లించాల్సిన పెండింగ్ సబ్సిడీలను దశలవారీగా ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకునే కనీస వేతనాలను నిర్ణయించామన్నారు. పారిశ్రామికవేత్తలను మేం కేవలం పెట్టుబడిదారులుగా మాత్రమే చూడటం లేదని, రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములుగా భావిస్తున్నామని వివరించారు. పారిశ్రామికాభివృద్ధికి పారి శ్రామికవేత్తలిచ్చే సలహాలు, సూచనలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొ న్నారు. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు రవికుమార్, కేకే మహేశ్వరీ, శ్రీనివాస్ గరిమెల్లా, భాస్కర్ రెడ్డి, అనిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.