07-01-2026 03:47:59 PM
గుడిసె వాసుల సమస్యలపై అధికారులతో చర్చ
సనత్‌నగర్,(విజయక్రాంతి): మీరు ఎవరికి భయపడొద్దు... మీకు అండగా ఉంటామని మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసారం బస్తీ గుడిసె వాసులకు భరోసా ఇచ్చారు. ఇటీవల సనత్ నగర్ లోని దాసారం బస్తీలో గుడిసె వాసులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ గుడిసెలు ఖాళీ చేయాలని కొంతమంది వ్యక్తులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం అధికారులతో కలిసి దాసారం బస్తీలో పర్యటించి స్థానిక గుడిసె వాసుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... 35 సంవత్సరాల క్రితం బ్రతుకు దెరువు కోసం నగరానికి వచ్చి ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాలలో చెత్తను సేకరిస్తూ పారిశుధ్య నిర్వహణతో పాటు జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. గుడిసెలు ఏర్పాటు చేసిన స్థలం మాది అని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు వారు, మాదే ఈ స్థలం అంటూ కొందరు ప్రయివేట్ వ్యక్తులు గుడిసె వాసులను ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2014 లో తాను ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత గుడిసె వాసులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వచ్చామని గుర్తు చేశారు.
సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో విద్యుత్, త్రాగునీటి సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటూ స్థానికంగా ఓటు హక్కును కూడా కలిగి ఉన్నారని వివరించారు. మీరు అంతా ఐక్యంగా ఉండాలని, ఎవరికి భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, అవసరమైతే మీ తరపున న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రకటించారు. మీ ఇల్లు, మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా మీతో పాటు మీ పరిసరాలలోని ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.