31 August, 2026 | 6:26 AM

మా గురించి మాట్లాడండి!

20-05-2024 01:47 AM

వాళ్లు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో అనునిత్యం బతుకుపోరాటం చేస్తూ హైదరాబాద్ మహానగరానికి వచ్చారు. తమ పోరాటానికి మద్దతు  కోరడానికి వచ్చారు. తాము ఎందుకు పోరాడుతున్నామో చెప్పడానికి వచ్చారు.  తమ పోరాటం ఈ దేశ ప్రజలందరిదీ అని వివరించడానికి వాళ్లు దండకారణ్యం నుంచి వచ్చారు. గత మూడేళ్లుగా సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మూలవాసీ బచావో మంచ్ నాయకులు రఘు మిడియామి, సోడి భీమా  తమ ఆవేదనను, పోరాటాన్ని బుద్ధిజీవులకు చెప్పుకోవడానికి వచ్చారు. 

ఈ సందర్భంగా విజయక్రాంతికి వాళ్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

మూలవాసీ బచావో మంచ్

మా పోరాటం మాకోసం మాత్రమే కాదు కదా. ఈ దేశ వనరులను కాపాడేందుకు చేస్తున్నది. కానీ దీన్ని మిగతా సమాజం పట్టించుకోవడం లేదు. ఇదేదో ఆదివాసీలకు సంబంధించిన సమస్య, లేదా మావోయిస్టులకు, పోలీసులకు సంబంధించిన వ్యవహారంగా చూస్తున్నారు.

* మీ పోరాటం గురించి చెప్పండి?

మేము మూలవాసీ బచావో మంచ్ సంఘ నాయకత్వంలో పోరాడుతున్న ఆదివాసులం. 2021 మేలో సిలింగేర్ అనే గ్రామంలో సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా మొదలైన పోరాటంలోంచి మా ఈ మూలవాసీ బచావో మంచ్ ఏర్పడింది. అంతా ఇరవై, ఇరవైఐదేళ్ల యువతీ యువకుల నాయత్వంలో ఈ సంస్థ నడుస్తున్నది. ఒక సిలింగేర్ వందల సిలింగేర్లుగా మారి ఇప్పటికీ కార్పొరేటీకరణ, సైనికీకరణకు వ్యతిరే కంగా పోరాటం నడుస్తున్నది.  తాజాగా ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు బస్తర్‌లో వందలాది మంది బలగాలు ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలు చేస్తున్న తరుణంలో ఇప్పటికీ పోరాడుతున్న సంస్థ మాది. 

దండకారణ్యంలో ఇటీవల పెద్ద ఎత్తున ఎన్‌కౌంటర్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకూ అక్కడ ఏం జరుగుతున్నది? 

ఛత్తీస్‌గఢ్ శాసనసభకు ఎన్నికలు జరిగి డిసెంబర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఆదివాసుల మీద దాడులు తీవ్రమయ్యాయి. అంతకు ముందు కూడా దాడులు జరిగాయి. డ్రోన్లతో బాంబులు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సైనిక క్యాంపులు పెద్దఎత్తున పెట్టారు. వాటికి వ్యతిరేకంగా సిలింగేర్లో పోరాటం మొదలైంది. వందలాది గ్రామాల్లో ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టవద్దని మేం పోరాటం నడిపాం. ఇప్పటికీ ఈ ఉద్యమం నడుస్తున్నది.  పోలీసు క్యాంపులను వ్యతిరేకిస్తున్నందుకు ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి.

మా అడవిని కాపాడుకోడానికి మేం ఈ ఉద్యమం చేస్తున్నాం. కార్పొరేట్ల తరపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద పెద్ద ఎత్తున హత్యాకాండకు పాల్పడుతున్నాయి.  అందులో భాగంగా ఇవాళ ఆపరేషన్ కగార్ అనే యుద్ధాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. వేలాది సైనిక బలగాలు ఆ ఊళ్లను చుట్టుముట్టాయి.  ఇండ్లలో ఉన్న వాళ్లమీద,  పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ల మీద కాల్పులు జరిపి చంపేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికి సుమారు పాతిక ఘటనల్లో 120 మందిని చంపేశారు. హత్యలే కాకుండా అరెస్టులు చేస్తున్నారు. కొట్టి వేధిస్తున్నారు. మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు. 

మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని మీరు అంటున్నారు. కానీ ఎక్కడా నమోదు కావడం లేదు ఎందుకు?

ఎందుకు అనేది మీలాంటి వాళ్లే చెప్పాలి. ఒకటి రెండు ఘటనలు కాదు మాకు తెలిసి 50 మంది ఇప్పటివరకు ఇలా అత్యాచారానికి గురైయ్యారు. అయితే ఈ సంఘటనలు పెద్దగా బయటకు రాలేదు. ఆదివాసీల మధ్య పనిచేస్తున్న సోనీసోరి, బెలాబాటియా వంటి హక్కుల కార్యకర్తలు వచ్చినప్పుడు తమ గోడును ఆదివాసీ మహిళలు చెబుతున్నారు. కానీ ఈ సంఘటనలు బయటకు వస్తే సైనికులు ఏం చేస్తారో అని ఆ బాధిత మహిళలు భయపడుతున్నారు. అయినా ఆ చుట్టు పక్కల ఉన్న వాళ్లకు ఏం జరిగిందో అనేది అర్థమవుతూనే ఉన్నది.

అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని..?

జిల్లా స్థాయిలో అధికారి కలెక్టర్.. కానీ మా దగ్గర ఏ కలెక్టర్ పట్టించుకోవడం లేదు. జిల్లా ఎస్సీ దగ్గరకు వెళ్లమని చెబుతారు. ఈ ఘటనకు ప్రధాన కారణమే ఎస్పీ లాంటి అధికారి అయినప్పుడు వాళ్ల దగ్గరకు పోయి ఏం చెప్పుకోవాలి? తీరా వాళ్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు. 

మీ పోరాటంలో మహిళల భాగస్వామ్యం ఎలా ఉంటుంది?

మా పోరాటంలో ఎక్కువ భాగం వాళ్లదే. నిత్యం నిర్బంధాలను, అవమానాలను ఎదుర్కొంటూ కూడా వాళ్లు ముందు వరుసలో ఉంటున్నారు. 2021 మేలో సిలింగేర్ ఆందోళన ప్రారంభమైనప్పుడు జరిగిన కాల్పులో గాయపడి మరణించింది ఓ గర్భిణి. ఒక రకంగా సిలింగేర్ పోరాటంలో మొదటి అమరురాలు ఓ మహిళ. అయినా పోరాటంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు ఆ పోరాటం 40 ప్రాంతాలకు విస్తరించింది.

పోరాటం విస్తరించినప్పుడు నిర్బంధం కూడా పెరుగుతుంటుంది కదా?

నిజమే పెరుగుతుంది. దానికీ ఒక ఉదహరణ చెప్పుకోవచ్చు. నారాయణపూర్‌లో ఆందోళన చేస్తున్న మహిళను సైనికుల బలగాలు స్నానం చేస్తున్నప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. తర్వాత వాటిని మొబైల్ ఫోన్లలో తీసుకువచ్చి.. మేం ఆందోళన చేస్తున్న దగ్గరకు వచ్చి ఇది నువ్వే కదా అంటూ ఆమెకు, మిగతా ఆందోళనకారులకు చూపించారు. ఇది పోరాటం చేస్తున్న వాళ్లను నైతికంగా దెబ్బతీయడానికి ప్రభుత్వం చేస్తున్న ఓ అనైతిక చర్య. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఎక్కడా ఉండకపోవచ్చు.

మరి ఇంత జరుగుతున్నప్పుడు సమాజం నుండి ఎందుకు స్పందన రావడం లేదు..

మేం అదే బాధపడుతున్నాం.  మణిపూర్‌లో ఓ దుర్మార్గమైన చర్య జరిగింది. ఓ మహిళను నగ్నంగా ఊరేగించారు. దాన్ని అందరూ ఖండిచాల్సిందే. అటువంటిది ఎక్కడా జరగకూడదు. కానీ మా దగ్గర ఇప్పటికీ 50 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. కానీ ఎక్కడా దీనిమీద నిరసన రావడం లేదు. కనీసం  ఏ మీడియా రిపోర్టు చేయడం లేదు. నిజానికి మా పోరాటం మాకోసం మాత్రమే కాదు కదా. ఈ దేశ వనరులను కాపాడేందుకు చేస్తున్న పోరాటం. కానీ దీన్ని మిగతా సమాజం పట్టించుకోవడం లేదు. ఇదేదో ఆదివాసీలకు సంబంధించిన సమస్య, లేదా మావోయిస్టులకు, పోలీసులకు సంబంధించిన వ్యవహారంగా చూస్తున్నారు.

ఈ నిత్య ఘర్షణలో పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది?

యుద్ధం మధ్య పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అలానే వుంది. ఈ మధ్య జరగిన సంఘటన ఒకటి చెబుతాను వినండి. ఇప్పటికే పిల్లలు చదువుకోవడానికి ఉన్న అంగన్వాడీ స్కూళ్లను పోలీసు క్యాంపులుగా మార్చివేశారు. ఆసుపత్రుల పరిస్థితి అదే. ఇక పిల్లలు ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వాళ్లకు పోలీసులు కాల్చిన గ్రెనెడ్ లాంచ్ కనిపించింది. అది పేలకుండా మిగిలిపోయింది. అదేదో అటవస్తువు అనుకున్న పిల్లలు తెలియకుండా దానితో ఆడుకుంటుంటే అది పేలి తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఇలాంటిదే ఇంకో ఘటన తప్పతాగి విచక్షణారహితంగా సీఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరిపితే తల్లి ఒడిలో పాలు తాగుతున్న ఆరు నెలల పాప చనిపోయింది. ఇదీ మా ఆదివాసీ పిల్లల పరిస్థితి. ఇక దీన్ని బట్టి ఊహించుకోండి అక్కడి పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో..

మరి ఇదంతా మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణ అని బయటి సమాజం అనుకుంటోంది?

కాదు..  తరతరాలుగా అడవిలో ఉన్న ఆదివాసులకు, ప్రభుత్వం తీసుకొస్తున్న కార్పొరేట్ విధానానికి మధ్య జరుగుతున్న ఘర్షణ ఇది. మేం జల్ జంగిల్ జమీన్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇప్పుడు భారత ప్రభుత్వం మా అడవిని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేస్తున్నది. దీన్ని మేం అంగీకరించడం లేదు. అందుకే మమ్మల్ని అణచివేస్తున్నారు.  భారత రాజ్యాంగంలో మాకు ఉన్న హక్కులను కాపాడాలని మేం కోరుతున్నాం. 

రాజ్యాంగ విలువలను కాదని ప్రభుత్వం దేనికి ఇట్లా చేస్తుంది?

ఆదివాసులు చేసిన పోరాటాల వల్ల రాజ్యాంగంలో మాకు హక్కులు ఇచ్చారు. కానీ భారత ప్రభుత్వం ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తున్నది. వాళ్ల ఆదాయం పెంచడానికి అడవిలోని సంపదను అప్పగిస్తున్నది. అడవిలోని సహజ వనరులే కాకుండా దేశంలోని ప్రజల ఆస్తులను ఈ వ్యక్తులకు ఇస్తున్నది. ఈ కార్పొరేటీకరణ దుర్మార్గమైనది. ఇది ఈ దేశ ప్రజలకు వ్యతిరేకమైనది. దండకారణ్యంలో జరుగుతున్న కార్పొరేటీకరణ ఆదివాసుల నిర్మూలనకు జరుగు తున్నట్లే, దేశంలోని ప్రజల హక్కులను ఇది కాలరాస్తున్నది. మాకు కార్పొరేటీకరణ ఎంత ప్రమాదకరమో నిత్యం అనుభవంలోకి వస్తున్నది. దీన్ని కాదని మేం పోరాడుతోంటే అణచివేయడానికి సైనికీకరణను ప్రభుత్వం పెంచుతున్నది. మేం ఈ రెంటికీ వ్యతిరేకంగా పోరాడాల్సిందే. మాకు ఈ సంగతి తెలుసు. లేకపోతే మా ఉనికి కూడా ఉండదు. ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తున్నదో వారికే తెలుసు. దానికి వ్యతిరేకంగా ఏం చేయాలో మాకూ తెలుసు. 

మీ పోరాటంలో మరణాలు, అత్యాచారాలు, బాధలు మాత్రమే మిగిలాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా? 

ఆదివాసులకు పోరాటం కొత్త కాదు. ఒకప్పటి సల్వాజుడుం మొదలు ఇప్పటి దాకా పోరాడుతూనే ఉన్నాం. వందలాది మంది చనిపోయారు. వేలాది మంది జైళ్లపాలయ్యారు. అనేక మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. పిల్లలకు, ముసలివాళ్లకు రక్షణ లేకుండా పోయింది. సైన్యం మధ్య మేం బతుకుతున్నాం. ఆకాశంలోంచి డ్రోన్ దాడుల మధ్య జీవిస్తున్నాం. అయితే మా పోరాటంలో మాకు బాధలే మిగిలాయని మేం అనుకోవడం లేదు. చాలా బాధలు పడుతున్నా, పోరాడబట్టే జీవించి ఉన్నామని మాకు తెలుసు. లేకపోతే మా జీవితమే లేదు. మేం పోరాడటం వల్ల సైనిక క్యాంపులను కొన్ని చోట్ల అడ్డుకున్నాం. కార్పొరేట్ల కోసం రోడ్లు వేయడాన్ని అడ్డుకున్నాం. గనుల తవ్వకాలను ఎదుర్కొన్నాం. మేం పోరాడి చాలా సాధించుకున్నాం. కాపాడుకున్నాం.

మీ పోరాటానికి బయటి సమాజం నుంచి మద్దతు వస్తున్నదా?

చాలా మంది మాకు మద్దతు ఇస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వ అణచివేత ఎక్కువైనందు వల్ల నేరుగా ప్రజాస్వామికవాదుల మద్దతు కోరడానికి మేం వచ్చాం. అడవి మాలో భాగం, మనందరి జీవావరణానికి ముఖ్యం. అందుకే మా పోరాటం ఈ దేశ ప్రజలందరి పోరాటం. మాకు అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని అడగడానికి వచ్చాం. మేం సిలింగేర్ పోరాటం మొదలు పెట్టినప్పుడు ఢిల్లీలో రైతులు ఉద్యమం ఆరంభించారు. దానికి మద్దతుగా మేం ప్రకటనలు ఇచ్చాం. సిలింగేర్ ఆందోళనల్లో భాగంగా రైతులకు మద్దతుగా ర్యాలీలు చేశాం. పాటలుపాడి, కళారూపాలను ప్రదర్శించాం. కార్పొరేట్ల కోసం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరాం. మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా మేం అక్కడి ప్రజలకు మద్దతుగా నిలబడ్డాం.  ఇప్పుడు మేం మద్దతు కోరుతున్నాం.

ఆపరేషన్ కగార్ విషయంలో మీరు నిర్ధిష్టంగా ఏం కోరుతున్నారు?

ఆదివాసీ జాతిని నిర్మూలించడానికి ఆపరేషన్ కగార్ తీసుకొచ్చారు. కాబట్టి వెంటనే దాన్ని నిలిపి వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలని కోరు తున్నాం. ఇప్పటి దాకా జరిగిన ఆదివాసీ హత్యల మీద న్యాయ విచారణ జరిపించాలి. బస్తర్‌లో పెట్టిన సైనిక క్యాంపులను ఎత్తేసుకోవాలి. దేశ సరిహద్దులోని సైనిక బలగా లను బస్తర్‌లోకి తరలించారు. వాటినీ,   పారా మిలటరీ బలగాలను, పోలీసులను వెనక్కి తీసుకోవాలి. అడవులను కొల్లగొట్టడానికి కార్పొరేట్లతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. అడవిని కాపాడాలి. ఆదివాసీ రక్షణకు ఉన్న చట్టాలను అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావాలి. రాజ్యాం గం ఆదివాసులకు వర్తించదా? మేం ఈ దేశ పౌరులం కాదా? అని అడుగుతున్నాం. మాతో గొంతు కలపాలని మద్దతు ఇవ్వాలని అందరినీ అడుగుతున్నాం.  

ఇంత చిన్నవయసులో పోరాటం చేస్తున్నారు కదా మీకు స్ఫూర్తి ఎవరు?

బిర్సముండా మాకు ఆదర్శం. మా హక్కుల కోసం పోరాటం చేసిన నాయకుడు ఆయన. ఆయనలా పోరాటం చేసిన గుంఢాదర్, బాబురావ్ షడ్మాకే.. ఇలా జల్, జంగల్, జమీన్ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరూ ఆదర్శమే.