7 August, 2026 | 2:30 AM

క్వార్టర్ ఫైనల్లో తన్విశర్మ

07-08-2026 12:00 AM
  1. అస్మిత, రక్షిత జోడీ ముందంజ
  2. కొరియా మాస్టర్స్ టోర్నీ

అసన్ సిటీ, ఆగస్టు 6 : భారత యువ షట్లర్ తన్వి శర్మ కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇటీవలే తైపీ ఓపెన్ టైటిల్ గెలిచి ఫామ్‌లో ఉన్న తన్వి ఇక్కడ కూడా అదే జోరు కొనసాగిస్తోంది. హోరాహోరీగా సాగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో 17 ఏళ్ల తన్వి 21-16, 17-21, 21-13 స్కోరుతో భారత్‌కే చెందిన శ్రేయాన్షి వలిశెట్టిపై విజయం సాధించింది. తొలి గేమ్ గెలిచిన తన్వికి రెండో గేమ్‌లో శ్రేయాన్షి షాకిచ్చింది.

అయితే డిసైడింగ్ మూడో గేమ్‌లో మాత్రం తన్వి పూర్తి ఆధిపత్యం కనబరిచి మ్యాచ్‌ను గెలుచుకుంది. అటు మహిళల సింగిల్స్‌లో మరో భారత సంచలనం అన్మోల్ ఖర్బ్ పోరాటం ప్రీ క్వార్టర్స్‌లోనే ముగిసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో వియాత్నంకు చెందిన ట్రి తంగ్ చేతిలో 23-21, 15-21, 21-18 స్కోరుతో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్‌లో అస్మిత చలిత, రక్షిత రామ్‌రాజ్ జోడీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రీ క్వార్టర్స్ ఈ భారత జోడీ 21-15, 21-9 స్కోరుతో జపాన్‌కు చెందిన నకాడే,టకహాషి జోడీపై గెలుపొందింది.