16-08-2024 09:13:31 PM
మహిళలపై బీఆర్ఎస్ వివక్ష మానుకోవాలి
కేటీఆర్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి
జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మీ
జగిత్యాల: మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటి స్పందన చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ విమర్శలకి దిగడం దురదృష్టకరం అని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయలక్ష్మి మాట్లాడుతూ... ఆడవాళ్లు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు స్పష్టం చేశారు.
ఆర్టీసీ బస్సులో మహిళలు బ్రేక్ డ్యాన్స్ లు, రికార్డింగ్ డ్యాన్స్ లు చేసుకోవచ్చని మాట్లాడ్డం మహిళల పట్ల ఆయనకున్న గౌరవం, సంస్కారంకు నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. పబ్ లు, క్లబ్ లు, బ్రేక్ డ్యాన్స్ లు రాష్ట్ర రాజధానిలో ప్రోత్సాహించిన చరిత్ర గత తెలంగాణ పాలకులకే ఉందని, అదే అందరు పాటిస్తారని భావించడం సరికాదన్నారు. మహిళలకు ప్రయాణం భారం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఉచిత రవాణా పథకం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు ఉపయోగపడే పథకాలు బీఆరెస్ నచ్చవా లేక మింగుడు పడడం లేదా అర్థం కావడం లేదని తెలిపారు.
ఎక్కడో మూలాన సమయం వృధా చేయకుండా ఏవో తమకు తోచిన పనులు చేసుకుంటే తప్పేంటి అని విజయలక్ష్మి ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలను బ్రేక్ డ్యాన్స్ లు చేసుకోవచ్చని మాట్లాడి, యావత్ మహిళా లోకాన్ని అవమానించిన కేటీఆర్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా మహిళలను కించపరిచేల చేసినా వ్యాఖ్యలను కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ లు సుమోటో గా తీసుకోని కేసు నమోదు చేయాలని విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం నచ్చకపోతే పథకం పై విమర్శలు చేయాలి తప్ప అందులో ప్రయాణించే మహిళా ప్రయనీకులపై విమర్శలు చేయడం తగదని, ఈ వైఖరి మానుకోవాలని విజయలక్ష్మీ హితవు పలికారు.