21-11-2025 07:45:20 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ అంగన్వాడి కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ శుక్రవారం సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం తదితర విషయాల పట్ల అవగాహన వస్తోందని అన్నారు. మహిళ తనతో పాటు తన పిల్లల పోషణ ఎలా ఉందో తెలుసుకోగలుగుతోందని అన్నారు. సృజనాత్మకతతో అంగన్వాడీ టీచర్లు విభిన్నమైన ఆట వస్తువులను తయారు చేసి చిన్నారులకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ నేర్పుతారని అన్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బీపీ షుగర్ వంటి అన్ని వ్యాధులకు పరీక్షలతో పాటు గోలీలు ఉచితంగా ఇస్తారని తెలిపారు. నెల నెల మందులు వాడేవారు ఆరోగ్య సిబ్బందికి తెలియజేస్తే ఇంటి వద్దకే మాత్రలు అందజేస్తారని అన్నారు. గ్రామంలోని ప్రతి మహిళ ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
తదుపరి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత పరీక్షలు చేయించుకున్న అనేకమందిలో రోగ నిర్ధారణ ముందుగా గుర్తించారని, తద్వారా ఉచిత వైద్య సేవలు పొంది కోలుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సిడిపిఓ సబిత మరియు అధికారులు పాల్గొన్నారు.