24 April, 2026 | 8:50 AM

తాండూర్ సభలో మోడీపై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు

11-05-2024 04:36 PM

వికారాబాద్: ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. తాండూర్ జనజాతర సభలో ప్రియాంక గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరాగాంధీ తర్వాత సోనియమ్మపై అభిమానం చూపించారని తెలిపారు. తెలంగాణ అంటే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రియాంక పేర్కొన్నారు. దేశ ప్రజలు చెప్పే సమస్యలు వినటానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్ నేతలు భావిస్తారని తెలిపారు. రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలని దేశంలో ప్రయత్నం జరుగుతోందని పునరుద్ఘాటించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేమీ ఉండవన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో రూ. 1200 ఇస్తున్న గ్యాస్ సిలిండర్ ను తెలంగాణలో  రూ.500కే ఇస్తున్నారని పేర్కొన్నారు.

రైతులు, నిరుపేదలు, మహిళల కోసం బిజెపి ప్రభుత్వం ఏమీ చేయదని ఆరోపించారు. బిజెపి పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. పేద రైతులు రూ. 50 వేలు, రూ. లక్షల రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు బిజెపి సర్కార్ అంగీకరించదు, బడా వ్యాపారులకు మాత్రం బిజెపి సర్కార్ రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తోందని మండిపడ్డారు. బిజెపి సర్కార్ కీలకమైన సంస్థలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని ఆడిస్తోందని ధ్వజమెత్తారు. ఈ 75 ఐదేళ్లలో ఎవరి పాలనలో అభివృద్ధి మార్పు జరిగిందో గమనించాలని ప్రజలను కోరారు.

ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకునే ప్రయత్నాన్ని మోడీ ఎప్పుడూ చేయరని విమర్శించారు. ఎన్నికల వచ్చినప్పుడు మాత్రం వచ్చి ధర్మ అనే నినాదం ఎత్తుకుంటారన్నారు. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టి ఓట్లు వేయించుకుంటారని ఆరోపించారు. కాంగ్రెస్ పై బిజెపి నేతలు ఎన్నో అబద్ధాలు చెప్పున్నారు.. కాంగ్రెస్ కొందరి ఆస్తులు గుంజుకుని మరో వర్గానికి ఇస్తోందని బిజెపి దుష్ప్రచారం చేస్తోందని వివరించారు. రద్దుచేయడానికి ఈ రాజ్యంగం మోడీ రాయలేదు.. మన పూర్వీకులు ఎంతో కృషిచేసి భావితరాల కోసం రాజ్యంగం రూపొందించారని తెలిపారు. ధర్మంపేరిట అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు.. ధర్మంపేరిట ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాజ్యంగం మనకు ఎన్నో అవకాశాలు కల్పించింది. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేది రాజ్యంగం మాత్రమేనని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.