అప్పుల ఊబిలో తెలంగాణ
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, జూలై 2 (విజయక్రాంతి): పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణను రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి, అన్ని శాఖల్లో బకాయిలు పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం, ఢిల్లీ లిక్కర్ స్కామ్, ధరణి, దళితబంధు సహా ప్రతి పథకంలోనూ బీఆర్‌ఎస్ నేతలు అడ్డగోలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ విద్య వంటి హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. షాద్ నగర్లో కేటీఆర్ అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసి పూర్తి చేస్తోందని గుర్తుచేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్‌ఎస్ అగ్రనేతలకు భవిష్యత్తులో జైలు శిక్ష తప్పదని శంకర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






