15-09-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు తమ తమ ఇండ్లపై జాతీయ జెండా ను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ కొమ్మిడి నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 అనేది ఒక తేదీ కాదని తెలంగాణ కు నిజమైన స్వతంత్రం సిద్దించిన రోజు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
పరాయి ఆధిపత్య శక్తులను ఖండించే క్రమంలో కొందరు రాజకీయ నాయకులు సెప్టెంబర్ 17 ను రాజకీ యాలకు వాడుకుంటున్నారన్నారని పేర్కొన్నారు. ఒకరిని ఖండించడంకోసం మరొకరి ని ఎత్తుకోవడం చేస్తున్నారన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలకు సెప్టెంబరు 17 ఒక ప్రత్యేకమైన రోజని, తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఆ రోజును విద్రోహ దినమని కొందరు, విలీనదినమని మరికొందరు వాదిస్తున్నారని పేర్కొన్నారు.
కానీ ఈ అవకాశవాద రాజకీయ నాయకులు ఒక మౌలిక అంశాన్ని విస్మరిస్తున్నారు. పార్టీలు, వారి రాజకీయ సిద్ధాంతాలు, వాదోపవాదాలతో నిమిత్తం లేకుండా ఆరోజు తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారని గుర్తు చేశారు. భూస్వామ్య, రాచరిక ప్రభువు ప్రజాస్వామిక ప్రభువు ఎలా అవుతాడో ఈ రాజకీయ నాయకులు చెప్పాలని తన ప్రకటనలో డిమాండ్ చేశారు.
అయితే భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చిన అతి కొద్దిమంది నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి గర్జించి ప్రజల పక్షాన నిలబడి పోరాడిన మాట వాస్తవం. నిజాం ప్రజాస్వామిక వాది కాదు. ఆ రోజు అటు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కానీ, ఇటు కమ్యూనిస్టు పార్టీగానీ పోరాడింది నిజాం నుంచి విముక్తి పొందడం కోసమే. అందుకే 1948 సెప్టెంబరు 17న కేంద్రం పంపిన సేనలు హైదరాబాద్ను స్వాధీనం చేసుకున్నప్పుడు తెలంగాణ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
సీమాంధ్రుల గుప్పిట్లో బందీ అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 2014 జూన్ 2న ఎంత సంబురపడ్డారో, నిజాం, అతని సైన్యం చేరవీడిన సెప్టెంబర్ 17వ తేదీన కూడా నాటి తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఇంత కంటే ఎక్కువగా సన్తజోసించారని కొమ్మిడి నర్సింహారెడ్డి తెలిపారు. భారత సైనిక చర్య వల్ల ఒక భూస్వామ్య ప్రభుత్వం అంతరించి, ఒక జాతీయ ప్రజాస్వామిక ప్రభుత్వానికి బీజం పడటానికి సెప్టెంబర్ 17న తెలంగాణ కు సిద్దించిన స్వంతత్రమే కారణం.
తెలంగాణ అస్తిత్వం ప్రతీకలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తామని చెప్తున్న పాలకులు, రాజకీయ నాయకులు రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్17వ రోజును ఎలా విస్మరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 15న తెలంగాణ కు స్వాతంత్రం రాలేదని, తెలంగాణకు స్వాతంత్య్రం సెప్టెంబరు 17న వచ్చింది అనే నిజాన్ని నేటి పాలకులు గుర్తించి భవిష్యత్తు తరాలకు తెలిసేలా సెప్టెంబర్17న తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ స్వతంత్ర వేడుకలను నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు. లేదంటే తెలంగాణ పోరాట చరిత్రను అవమానించడం అవుతుందని కొమ్మిడి నర్సింహారెడ్డి తన ప్రకటన లో పేర్కొన్నారు.