09-07-2025 01:11:07 AM
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించేందుకు మూడేండ్లకోసారి కేంద్రం నిర్వహించే న్యాస్ (పెర్ఫార్మెన్స్ అసెస్‌మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెజ్డ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్) సర్వే లో తెలంగాణ ఈసారి మెరుగైన ఫలితాలు సా ధించింది. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్ష ద్వారా ఆయా రాష్ట్రాల్లోని 3, 6, 9వ తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను కేంద్రం అంచనా వేస్తోంది.
ప్రతి మూడేండ్లకు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. గతంలో 2021లో నిర్వహించగా, ఈసారి 2024 డిసెంబర్ 4న నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి మొత్తం 3,342 పాఠ శాలలు ఇందులో పాల్గొన్నాయి. ఇందులో లాంగ్వెజెస్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ అండ్ సైన్స్ అంశాలపైన ప్రశ్నలుంటాయి. 2021లో జాతీ య ర్యాంకింగ్‌లో తెలంగాణ 36వ స్థానంలో నిలవగా, ఈసారి 26వ స్థానంలో నిలిచి మెరుగైనా ప్రతిభను కనబరిచింది.
లాంగ్వెజెస్, మ్యాథమెటిక్స్ అంశాల్లో మూడో తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. 3వ తరగతిలో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల కంటే మన ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా రాణించాయి. విద్యార్థుల అభ్యాసన ఫలితాలు మెరుగుపరడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతోనే ఈ ఫలితాలు సాధించామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు.
ఏపీ కంటే మనం మెరుగే..
ఈ ఫలితాల్లో ఏపీ కంటే మనం మెరుగైన స్థానంలో నిలిచాం. ఈ సర్వేలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి. అయితే మూడో తరగతిలో తెలంగాణ 26వ స్థానంలో నిలవగా, ఏపీ రాష్ట్రం 13వ ప్లేస్‌లో నిలిచింది. ఆరో తరగతిలో తెలంగాణ 26వ స్థానంలో నిలవగా, ఏపీ మాత్రం 33వ స్థానంలో నిలిచింది.
9వ తరగతిలో తెలంగాణ 17వ స్థానంలో నిలవగా, ఏపీ 29వ ప్లేస్‌లో నిలిచింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ పది రాష్ట్రాల్లో తెలంగాణ లేదు. అయితే తక్కువ సామర్థ్యం కనబరిచిన 10 రాష్ట్రాల్లోనూ తెలంగాణ లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం.
16వ స్థానంలో జనగామ..
గ్రేడ్ దేశవ్యాప్తంగా మెరుగైన ప్రతిభ కనబరిచిన టాప్ 50 జిల్లాల్లో జనగామ జిల్లా 16వ స్థానంలో నిలిచింది. తక్కువ సామర్థ్యం కనబరిచిన జిల్లాల్లో వనపర్తి 14వ ప్లేస్‌లో నిలిచింది. గ్రేడ్ మెరుగైన ప్రతిభ కనబరి చిన జిల్లాల్లో జనగాం 35వ స్థానంలో నిలవగా, అత్యల్ప సామర్థ్యం కనబరిచిన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం 37వ, ములుగు 47వ స్థానం సాధించింది.
గ్రేడ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విభాగంలో జనగామ జిల్లా 33వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో తక్కువ సామర్థ్యం కనబరిచిన జిల్లాల్లో తెలంగాణ నుంచి ఏ జిల్లా లేకపోవడం గమనార్హం.
ఇది ప్రతిభ టీచర్ల విజయమే
నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్ లో తెలంగాణ పాఠశాల విద్య ప్రతిభ కనబర్చ డం అభినందనీయం. 2021లో 36వ స్థానంలో ఉన్న రాష్ట్రం 26వ స్థానానికి చేరడం గర్వించదగ్గ పరిణామం. ఇది ప్రభుత్వ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం.
ప్రైవేట్ పాఠశాలలతో పోటీగా ప్రభుత్వ పాఠశాలలూ ప్రతిభను కనబర్చడం ఘన విజయమే. టీచర్లను ప్రోత్సహిస్తే రాష్ట్ర ప్రతిష్టను మెరుగుపరిచే విజయాలు సాధించొచ్చని ఈ సర్వే నివేదికే రుజువు చేస్తోంది. భవిష్యత్‌లోనూ పాఠశాల విద్య మరింత మెరుగవ్వాలని, ఆ దిశగా అవసరమైన తోడ్పాటు ఇచ్చేందుకు ఉపాధ్యాయలు, మేము సిద్ధం.
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి