calender_icon.png 9 July, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సమరానికి కాంగ్రెస్ సై!

09-07-2025 12:59:09 AM

  1. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రణాళిక 
  2. సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు 
  3. పథకాల అమలుతీరుపై ఎప్పటికప్పుడు సీఎం, మంత్రుల దిశానిర్దేశం
  4. పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్న పీసీసీ 
  5. మిగిలిన నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై దృష్టి

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సమరానికి సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో..ఆ లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే పార్టీ క్యాడర్‌ను క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేయడం,  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి మెజార్టీ స్థానాలు హస్తగతం చేసుకోవా లనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది.

అందులో భాగంగానే  రాష్ట్ర ప్రభు త్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై స్పీడ్ పెంచుతుంటే..పీసీసీ నాయకత్వం కూడా పార్టీ క్యాడర్‌ను ఇప్పటినుంచే అప్రమత్తం చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయని, దీంతో సర్కార్‌పై ప్రజలు సానుకూ లంగా ఉన్నారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ‘రైతు భరోసా’ను సర్కార్ ఛాలెంజ్‌గా తీసుకుని 9 రోజుల్లోనే.. 15 ఎకరాల సాగుభూమి వరకు రూ.9వేల కోట్ల వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

సర్కార్ ఏర్పడిన ఏడాదిలోపే రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వడంతో ప్రభుత్వంపై రైతులు మరింత నమ్మకంతో ఉన్నారని చెబుతున్నారు. ‘సన్నబియ్యం’ పంపిణీ పథకం సర్కార్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చిందని అభిప్రాయంతో పార్టీ నేతలున్నారు. సన్నబియ్యం పంపిణీతో ప్రతీ కుటుంబం సంతోషంగా ఉందని, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల పంపిణీతోనూ ప్రజలు అధికార కాంగ్రెస్‌ను ఆదరిస్తారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500లకు గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాల అమలుతో స్థానిక ఎన్నికల్లో  ప్రజలు కాంగ్రె స్ పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తా రనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. జిల్లా ఇన్‌చార్జ్ మం త్రులు కూడా ప్రభుత్వ పథకాల అమలుపై ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. 

పార్టీ క్యాడర్ అప్రమత్తం..

పార్టీపరంగా కూడా క్యాడర్‌ను పీసీసీ నాయకత్వం అప్రమత్తం చేస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది పార్టీ క్యాడరేనని, అందుకు గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేస్తోంది. ఇటీవలనే ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో నిర్వహించిన భారీ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన విషయం తెలిసిందే.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీగా హస్తగతం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు ఖర్గే దిశానిర్దేశం చేశారు. ఇటీవలే నియామకమైన పీసీసీ ఉపాధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులకు పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్ బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అప్పగించిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్‌చార్జ్‌లు గా పార్టీ సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న కోల్డ్‌వార్‌ను తగ్గించే ప్రయత్నం పార్టీ మొదలుపెట్టింది. 

నామినేటెడ్ పదవుల పంపకంపై ప్రత్యేక దృష్టి.. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పార్టీలోని వివిధ కార్పొరేషన్లు, కమిషన్లకు పార్టీలోని పలువురు నేతలకు పదవులు కట్టబెట్టింది. ఇంకా ఖాళీగా ఉన్నవాటిని కూడా త్వరలోనే భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇక నియోజకవర్గాలు, జిల్లా స్థాయి పోస్టులను భర్తీ చేసే బాధ్యత ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. రాష్ట్ర స్థాయి పదవుల భర్తీకి కూడా అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం చూస్తున్నారు.

ఇప్పటికే పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ప్రకటించిన ఏఐసీసీ త్వరలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పీసీసీ కార్యవర్గ సభ్యులతో పాటు డీసీసీ, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులను కూడా పూర్తి చేసి.. పార్టీ క్యాడర్‌కు పని కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది. 

గ్రామాల్లో బీజేపీ ఉనికి లేదు.. బీఆర్‌ఎస్‌కు పట్టులేదు.. 

గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉందనే నమ్మకంతో ఆ పార్టీ నేతలున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో బీజేపీకి పెద్దగా ఉనికి లేదని, బీఆర్‌ఎస్‌కు పట్టులేదని, బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీనేనని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నా యి. మున్సిపల్, నగర కార్పొరేషన్లలో కొన్నింటిలో బీజేపీ, కొన్నింటిలో బీఆర్‌ఎస్ నుంచి పోటీ ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్‌ను ఢీ కొట్టేంత పరిస్థితి లేదని, అయినా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూనే క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 

ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లింపు.. 

సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రభుత్వం దూకుడుతో ఉండి ప్రజలను చేరువయ్యే పరిస్థితి కొనసాగిస్తూనే..మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకుసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కీలకంగా ఉంటారని, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుంది.

అందుకే ఉద్యోగులకు రెండు డీఏలను ప్రకటించిన ప్రభుత్వం తక్షణమే ఒకటి అమల్లోకి తీసుకొచ్చి..మరొక డీఏ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు రూ.180 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బకాయిలు గత ప్రభుత్వం హయాం నుంచే పెండింగ్‌లో ఉన్నాయి.

గ్రామపంచాయతీల్లో పనిచేసే మల్టీపర్పస్ కార్మికులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు రూ.150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గత ఎన్నికల ముందు బదిలీ అయిన  ఉద్యోగులు, అధికారులు, ఇతర సిబ్బందిని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు పూర్వస్థానాలకు పంపించే ప్రక్రియను చేపట్టింది. పలు శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించింది.