09-07-2025 01:03:18 AM
హైదరాబాద్, జూలై 8/భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల రామాలయ ఈవో రమాదేవిపై భూకబ్జాదారులు దాడికి పాల్పడ్డా రు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా పురుషోత్తపట్నంలో ఉన్న రామాలయానికి చెందిన 889.5 ఎకరాల భూమిలో ఆక్రమణలను అడ్డుకోవడానికి మంగళవారం ఆలయ సిబ్బంది, అర్చకులతో కలిసి ఈవో రమాదేవి పురుషోత్తపట్నం వెళ్లారు. నిర్మాణాలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా కబ్జాదారులు ఈవోపై దాడికి పాల్పడ్డారు.
దీంతో ఈవో రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆలయ సిబ్బంది, అర్చకులు రక్షణ వలయంగా ఏర్పడి ఆమెను భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈవో రమాదేవిపై దాడిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. ఈవోతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం, ఆ రాష్ర్ట సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు.
కాగా గత కొంతకాలంగా పురుషోత్తపట్నలోని ఆలయ భూముల కబ్జాదా రులకు, రామాలయ అధికారులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భూములన్నీ రామాలయానివే అని తీర్పు ఇచ్చినా రెవెన్యూ అధికారులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకరించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈవో రమాదేవిపై దాడిని భద్రాచలం దేవస్థాన ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది.
పురుషోత్తపట్నలో ఏం జరుగుతున్నది?
భద్రాద్రి రాముడికి ఏపీ, తెలంగాణలో సుమారు 1,300 ఎకరాల భూమి ఉండగా అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నలోనే గరిష్ఠంగా 889.5 ఎకరాలు ఉంది. అందులో ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంది. ఆ భూములు కొంతమంది స్థానికులు ఆక్రమించుకుని భవనాలను నిర్మించుకుంటున్నారు. గత కొంతకాలంగా భవనాల నిర్మాణానికి ప్రయత్నించడం, దేవాలయ అధికారులు వెళ్లి అడ్డుకోవడం పరిపాటిగా మారింది.
ఏపీ హైకోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి. హైకో ర్టు తీర్పును పురుషోత్తపట్నం వాసులు పరిగణనలోకి తీసుకోవటం లేదు. అయితే గత రెండు రోజులుగా పురుషోత్తపట్నలోకి ప్రవేశించే మార్గంలో.. భద్రాచల ఆలయ భూ ముల్లో పిల్లర్లతో నిర్మాణ పనులు చేపడుతున్నారనే సమాచారం అందడంతో మంగళ వారం ఆలయ సిబ్బంది, అర్చకులతో కలిసి ఈవో రమాదేవి వెళి,్ల నిర్మాణాలు చేయవద్దని కోరారు.
ఇదిపూర్తిగా రాముడి భూమి అని వివరించారు. కోర్టు తీర్పులతో దేవుడి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయని వెల్లడించారు. అయినా వినకుండా నిర్మాణం చేస్తున్న వారితో పాటు పురుషోత్తపట్నం గ్రామస్థులందరూ ఈవో రమాదే వితో వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో ఈవోను తోసివేశారు.
దీంతో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఈవోను వాగ్వాదం జరుగుతున్న ప్రదేశం నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా కొంతమంది గ్రామస్థులు తోపులాటకు దిగారు.ఆ తోపులాటలో ఈవో స్పృహ కోల్పోయి, అస్వస్థతకు గురవడంతో ఆమెను హుటాహుటిన భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.
భూములతో మీకేం సంబంధం?
పురుషోత్తపట్నం భూములతో మీకేం సంబంధం అని, తెలంగాణ అధికారులు ఎవరూ ఇక్కడికి రావద్దు అని ఆ గ్రామస్థులు భద్రాచల ఆలయ అధికారులకు ఎదురు తిరిగారు. భద్రాద్రి రామయ్య భూములు దేశం లో ఎక్కడ ఉన్నా వెళ్లి కాపాడాల్సిన బాధ్యత తమపై ఉన్నదని చెప్పేందుకు దేవస్థాన అధికారులు ప్రయత్నించినప్పటికీ గ్రామస్థులెవ రూ వినకుండా వాగ్వాదానికి దిగారు.
ఇంత జరుగుతున్నా ఆంధ్ర పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు అక్కడే ఉన్నప్పటికీ ఈ ఘర్షణను నివారించడానికి ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. వారు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కాగా భద్రాద్రి రామయ్యకు చెందిన 889.5 ఎకరాల భూములు కాపాడేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే పూర్తిగా కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది.
ఏపీ సీఎం చొరవ తీసుకోవాలి: మంత్రి సురేఖ
రాష్ర్టంలో ఎక్కడైనా ఎండోమెంట్ భూములను కబ్జా చేస్తే పీడీయాక్టు పెడుతామని దేవాదాయ శాఖ మంత్రి కొం డా సురేఖ హెచ్చరించారు. పురుషోత్తపట్నంలోని భద్రాచల రామాలయ భూములు కబ్జా కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన ఈవో రమాదేవిపై దాడి చేయడం సహేతుకం కాదని, దాడి ని ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం, ఆ రాష్ర్ట సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు.
దాడికి సంబం ధించి భద్రాచల ఈవో రమాదేవితో మంత్రి సురేఖ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు మంత్రికి ఈవో వివరించారు. స్థానిక ఆసుపత్రిలో ఐసీయూలో ఆమె చికిత్స పొందుతున్నారని, ఆమెకు దేవాదాయ శాఖ అన్ని విధాలుగా అం డగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకోవాలని రమాదేవికి మంత్రి సురేఖ సూచించారు.