calender_icon.png 9 July, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేల్చుకుందామా?

09-07-2025 01:09:34 AM

మళ్లీ వస్తా.. డేట్, టైం చెప్పండి

సీఎంకు రచ్చ వచ్చు.. చర్చకు దమ్ములేదు: కేటీఆర్

  1. కేసీఆర్‌కు క్షమాపణ చెప్పి ముక్కునేలకు రాయి
  2. మైక్ కట్ చేయకుండా చర్చిద్దామంటే అసెంబ్లీకి వస్తాం
  3. నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి.. నియామకాలు తొత్తులకు..
  4. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

హైదరాబాద్, జూలై 8 (విజయ క్రాంతి)/ఖైరతాబాద్: ‘సీఎం చాలా బిజీగా ఉంటారు.. అందుకే ఆయనకు మరొక అవకాశం ఇస్తున్నా.. ప్లేసు, డేటు, టైము, మీరే డిసైడ్ చేయండి.. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు రమ్మంటే కూడా వస్తాం.. మైకులు కట్ చేయకుండా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధమే..’ అని మాజీమంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. 


ఏ అంశం మీద చర్చ పెట్టినా చర్చించడానికి కేసీఆర్ తయారుచేసిన గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నామన్నారు. తానే కాదు బీఆర్‌ఎస్‌లో ఏ నాయకుడైనా రేవంత్‌రెడ్డికి సరిపోతారని ఎద్దేవా చేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో రైతుభరోసా రాని 670 మంది రైతుల పేర్లు, అడ్రస్సులు, ఫోన్ నెంబర్లతో సహా తీసుకొని వచ్చానని ఆయన అన్నారు.

రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాన్ని తెచ్చి, దేశచరిత్రలోనే మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంటు ఇచ్చిన కేసీఆర్‌ను అడ్డగోలుగా తిట్టినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం, రైతు సంక్షేమంపై ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చించేందుకు సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌కు స్పందించిన మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు.

ఈసందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్‌ను సవాల్‌పై జూలై 8 తారీఖున 11 గంటలకు ప్రెస్‌క్లబ్‌కు వస్తామని, మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా చర్చిద్దామని చెప్పి వ చ్చాం. సీఎం రేవంత్‌రెడ్డి చర్చకు రాకుండా ఢిల్లీకి పోయారు. సీఎం రాలేకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి గాని, వ్యవసా య మంత్రి గానీ, లేదంటే ఇంకెవరైనా మంత్రులను పంపుతారని అనుకున్నాం..

రేవంత్‌కు కేసీఆర్ అవసరం లేదు.. చర్చకు వచ్చే దమ్ము లేదు. కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసని క్షమాపణ చెప్పాలి.’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. పనికిమాలిన సవాళ్లు, పనికిమాలిన డైలాగులు ఇంకొకసారి చెప్పొద్దన్నారు. రేవంత్‌రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు కాని చర్చ చేయడం రాదని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. 

సీఎంకు బూతులే వచ్చు..

రేవంత్‌కు బూతులు మాట్లాడడం వస్తుంది కానీ రైతుల గురించి మాట్లాడడం రాదని స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. రుణమాఫీ కానీ లక్షల మంది వివరాలతో జాబితా, రేవంత్ సీఎం అయ్యాక వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న 670 మంది రైతుల వివరాల తమ దగ్గర ఉన్నాయన్నారు. రాష్ర్టంలో బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కు లేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితాను తీసుకొని వచ్చానన్నారు.

రాష్ర్టంలో ఎరువుల కొరతతో రైతులను సతమతమవుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఆధార్ కార్డుతో ఒక ఎరువుల బస్తా, యూరి యా బస్తా ఇస్తామంటే చెప్పులను క్యూలో పెట్టి రైతులు ఫర్టిలైజర్ దుకాణాల ముందు ఎదురుచూస్తున్నారన్నారు. మళ్లీ ఆనాటి రోజులు తీసు కొస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగానే ఆ పాత దుర్ధినాలను తీసుకొచ్చిందని సోషల్ మీడియా లో పిల్లలు పోస్టులు పెడితేనే రేవంత్‌రెడ్డి గజగజ వణికిపోతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

బేసిన్ నాలెడ్జ్ లేదు..బేసిక్ నాలెడ్జ్ లేదు

గత 18 నెలలుగా రాష్ర్టంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని, ఒక్కటంటే ఒక్క హామీని కూడా రేవంత్‌రెడ్డి నెరవేర్చలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. బేసిన్ నాలెడ్జ్ లేని రేవంత్‌రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదని తెలిసినా కూడా సీఎం ముచ్చటపడుతున్నాడు కదా అని సవాల్ స్వీకరించానన్నారు. ‘ఏ ప్రాజెక్టు ఏ బేసిన్‌లో ఉంది అని ఇరిగేషన్ అధికారులను ఒక చిన్న పిల్లాడు అడిగినట్లు అడుగుతుంటే ఇతనా  మనకు న్యాయం చేసేదని రాష్ర్టంలోని రైతులు బాధపడుతున్నారు..

తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, మోసం చేస్తూ ఆయన గురువు చంద్రబాబుకు కృష్ణా, గోదావరి నీళ్లను పంపిస్తున్నారు..కింద గోదావరిలో బనకచర్ల కడుతుంటే పచ్చజెండా ఊపుతున్నారు.. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగచాటుగా తీసుకెళ్తుంటే కండ్లు మూసుకొని చంద్రబాబు చెప్పినట్టు కోవర్టు పాలన సాగిస్తున్నారు. నీళ్లేమో ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, తన తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని రేవంత్ మురి సిపోతున్నారు..’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. 

పైసల మూటలు మోసి పదవి కాపాడుకుంటున్నారు..

కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు పైసల మూటలు మోసి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నారన్న సంగతి తెలంగాణలోని చిన్న పిల్లలకు కూడా తెలుసని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ సోషల్ మీడియాలో రేవంత్‌రెడ్డికి పే సీఎం అనే పేరు పెట్టారన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, అణిచివేతలు, నిర్బంధాలు అని ప్రజలు తెలుసుకున్నారన్నారు.

సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును రీ ట్వీట్ చేసినందుకు నల్లబాలు అనే బహుజన బిడ్డను రేవంత్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చెప్పే పిచ్చిమాటలు, చేసే రోత చేష్టలను తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. 2018లోనూ కొడంగల్‌లో రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరి ఆ తర్వాత మాట మార్చి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారని, జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్ సొంతంగా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పారని, ఇవాళ కూడా తొడగొట్టి, సవాల్ విసిరి పారిపోయారని కేటీఆర్ విమర్శించారు.

కేటీఆర్ ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన సందర్భంగా అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుపుతూ వారికి సంతాపంగా ప్రెస్‌క్లబ్‌లో బీఆర్‌ఎస్ నేతలు ఒక నిమిషం మౌనాన్ని పాటించారు.  

అసెంబ్లీకి రండి.. చర్చిద్దాం

సీఎం సవాల్‌కు బీఆర్‌ఎస్ వద్ద సమాధానమేది?

  1. ఎవరు పడితే వారు చర్చకు రమ్మంటే ఎలా?
  2. జలవనరులు, అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమం.. అన్ని రంగాలపై చర్చించడానికి సిద్ధం
  3. కేసీఆర్‌ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారు..
  4. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై భగ్గుమన్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

మహబూబాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవా ల్‌కు సమాధానం ఇవ్వకుండా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీకి రాకుండా అడ్డుపడుతూ, ఎవరు పడితే వారు బహిరంగ చర్చ పేరుతో పిలిస్తే ఎలా వెళ్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క  ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే జలవనరులు, వ్యవసాయం, సంక్షేమం..ఇలా అన్నింటిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలోనే తేలుద్దామని కేటీఆర్‌కు భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.. రైతాంగానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో అన్యాయం జరిగిందని గొంతుచించుకొని అరుస్తున్న బీఆర్‌ఎస్ నేతలు ఎక్కడ అన్యాయం జరిగిందో అసెంబ్లీకి వచ్చి చూపాలని సవాల్ విసిరారు.

ప్రజా ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అన్యాయమా అంటూ ప్రశ్నించారు. రైతులకు బీమా సౌకర్యం, సన్నధాన్యానికి బోనస్ రూ.500 చొప్పున చెల్లించడం, గతంతో పోలిస్తే విద్యుత్తు డిమాండ్ పెరిగినప్పటికీ ఎక్కడ కూడా కోతలు లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం, పేదల ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం అన్యాయమా అంటూ ప్రశ్నించారు.

18 నెలల కాలంలో వ్యవసాయ రంగానికి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అన్యాయమా అని నిలదీశారు. లక్షన్నర కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులో పట్టుమని పది ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని బీఆర్‌ఎస్ నేతలు రైతాంగం, పేదల గురించి మాట్లాడడం చూస్తే నవ్వొస్తుందన్నారు.  తమ ప్రభుత్వం కృష్ణా, గోదావరి బేసిన్‌లలో తెలంగాణకు రావలసిన నీళ్ల వాటా కోసం నిక్కచ్చిగా పోరాడుతుందని, ఈ విషయంపై కూడా అసెంబ్లీలో చర్చిద్దామని రమ్మంటే, అసలు నిజాలు బయటికి వస్తాయని, అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తూ, బహిరంగ చర్చ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

10 సంవత్సరాలు పాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకొస్తే సంక్షేమం, అభివృద్ధి, నీళ్లు, నిధులు, ఉద్యోగాల అంశాలను చర్చిద్దామని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.  మీరు చేసిన పాలన నచ్చక, ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా ఇంకా మీ తీరు మారలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు.