8 May, 2026 | 2:06 AM

కొడుకు ప్రాణాన్ని బలిగొన్న తల్లి అక్రమ సంబంధం

07-08-2025 05:06 PM

నెన్నల మండలం ఆవుడంలో ఉద్రిక్తత..

బెల్లంపల్లి ఏసిపి ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) నెన్నెల మండలంలోని ఆవుడం గ్రామంలో గురువారం వివాహిత నేర్పిన అక్రమ సంబంధం వ్యవహారం ఆమె 20 ఏళ్ల కుమారున్ని బలి తీసుకుంది. ఈ సంఘటన స్థానికంగా వివాదాస్పదమైంది. గ్రామానికి చెందిన ఒక వివాహిత అదే గ్రామంలోని ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న మంగళి తిరుపతి అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. తిరుపతితో వివాహేతర సంబంధం మానుకోవాలని సదరు వివాహిత కొడుకు దురికి అనిల్(20) అనేకసార్లు మందలించినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో కొడుకు అనిల్ తీవ్ర మనస్థాపానికి గురై గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దీంతో కోపోద్రిక్తులైన మృతుని తండ్రి బాపు, అతని కుటుంబ సభ్యులు అనిల్ మృతదేహాన్ని ఆటో డ్రైవర్ మంగళ తిరుపతి ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మృతుని బంధువులు ఆగ్రహంతో మంగలి తిరుపతి ఇంట్లోకి వెళ్లి ఇంటికి నిప్పు పెట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం తెలుసుకున్న బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ హుటాహుటిన పోలీసులతో ఆవుడం గ్రామానికి చేరుకుని మృతి చెందిన అనిల్ బంధువులను శాంతింపజేశారు. అనిల్ మృతికి గల కారణాలను గ్రామస్తులతో పాటు, మృతుని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాహిత నెరిపిన అక్రమ సంబంధం వ్యవహారం ఇరు కుటుంబాల్లో చిచ్చు రేపింది.