27 August, 2026 | 2:42 AM

సాగర్ కేంద్రంగా మరోసారి జల జగడం

27-08-2026 12:12 AM

కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా కుడి కాలువకు నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు

అభ్యంతరం వ్యక్తంచేసిన తెలంగాణ అధికారులు

నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం 

నల్లగొండ/హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం రాజుకున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయడం తీవ్ర కలకలం రేపింది.

తెలంగాణ నిర్వహణలో ఉన్న ప్రాజెక్టు వద్ద ఏపీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంపై స్థానిక అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఏపీ వైఖరిని నిరసిస్తూ, పోటీగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా ఎడమ కాలువకు నీటిని విడుదలచేశారు. ఈ హఠాత్ పరిణామంతో సాగర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

అనుమతులు లేని నీటి విడుదలను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ అధికారులు స్పష్టం చేయగా, ప్రాజెక్టు పరిధిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదలచేశారు. త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఆ జలాశయాన్ని నింపడం కోసం ఈ నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.

నాలుగు రోజులపాటు నీటిని విడుదల చేయనున్నట్టు సమాచారం. మొదట 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసి క్రమంగా పెంచనున్నట్టు తెలిసింది. పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నిండిన తర్వాత కాల్వ ద్వారా ఖమ్మ జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే సాగర్‌లో 590 అడుగులకు ప్రస్తుతం 534 అడుగుల మేర నీరు ఉన్నది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఏంసీలు కాగా, ప్రస్తుతం 180.4 టీఎంసీలుగా ఉన్నది. సాగర్ జలాశయానికి ఎగువ నుంచి 21 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది.

ఇటీవల కేఆర్‌ఎంబీ సమావేశాల్లోనూ నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కృష్ణా జలాల వినియోగంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ముఖ్యంగా తాగునీటి అవసరాల కోసం నీటిని వినియోగించడంపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. తాగునీటి అవసరాలకు 50: 50 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ కోరింది. ఈ నేపథ్యంలో సాగర్ నుంచి నీటి విడుదల అంశం మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నది. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పరిమితంగా ఉన్న సమయంలో ప్రతి క్యూసెక్కు నీటి విడుదల కూడా కీలకంగా మారింది.

తాగు, సాగునీటి అవసరాలు ఒకేసారి పెరుగుతున్న పరిస్థితుల్లో నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత అవసరంగా మారింది. అయితే కేఆర్‌ఎంబీ అనుమతులు, పరస్పర సమ్మతి లేకుండా నీటిని విడుదల చేసే ప్రయత్నాలు వివాదానికి కారణమవుతున్నాయని తెలంగాణ వాదిస్తున్నది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య అనేక సందర్భాల్లో వివాదాలు తలెత్తాయి. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, తాగునీటి అవసరాలు, సాగునీటి వాటాల విషయంలో పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి.

తాజాగా సాగర్ వద్ద చోటుచేసుకున్న పరిణామం ఈ వివాదానికి మరో అధ్యాయంగా మారింది. నీటి విడుదల విషయంలో ఇరు రాష్ట్రాల అధికారులు తమతమ వాదనలకు కట్టుబడి ఉంటే.. ఈ వ్యవహారం కేఆర్‌ఎంబీ దృష్టికి వెళ్లే అవకాశం ఉన్నది. ఇప్పటికే కృష్ణా జలాల వినియోగంపై బోర్డు స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సాగర్ వద్ద తాజా పరిణామంపై కూడా స్పష్టత రావాల్సి ఉన్నది.