25-05-2025 11:11:04 PM
మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్..
దిల్ సుఖ్ నగర్ నుంచి ఆర్కేపురం డివిజన్..
అష్ట లక్ష్మి కమాన్ వరకు తిరంగా ర్యాలీ..
ఎల్బీనగర్: ఉగ్రవాదాన్ని అంతమొందించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) పేరిట భారతదేశం చేసిన దాడులతో పాకిస్తాన్ అతలాకుతలం అయిందన్నారు. మహిళల నుదుటిపై సింధూరం తుడిపేసిన వారిని అంతమొందించేందుకు కంకణ బద్దులై ముందుకురావడం గర్వకారణమన్నారు. సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దిల్ సుఖ్ నగర్ నుంచి ఆర్కేపురం డివిజన్ అష్ట లక్ష్మి కమాన్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల స్టావారాలపై 25 నిమిషాల్లో 9 స్థావరాలపై దాడులు చేసి భారత దేశం తన సత్తా చాటిందన్నారు.
గతంలో దొంగచాటుగా టెర్రరిస్టు మూకలు దాడులు చేసాయని నరేంద్రమోడీ హయాంలో ఉగ్రవాదాన్ని అంత మొందించడానికి 356 ఆర్టికల్ రద్దు చేసి లాల్ చౌక్ పై మువ్వన్నెల జెండా ఎగరవేసిన మహనీయుడు మోడీ అన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలకు ఛాలెంజ్ చేసారని గుర్తు చేసారు. మూడు రోజులలో పాకిస్తాన్ పాలకులను మోకాళ్ల పైన నిలబెట్టినట్లు తెలిపారు. మూడు రోజుల్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా జవాబు చెప్పామని, యుద్ధానికి ఎప్పటికైనా సిద్ధమని చాటామన్నారు. అత్యాధునిక క్షిపణులను తయారు చేసిన ఘనత మన హైదరాబాద్ కు దక్కిందన్నారు. భారత జాతి ఆత్మగౌరవం కాపాడుకునేందుకు ప్రధాని మోడీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. భారత సైన్యానికి, ప్రధాని మోడీకి మనం అందరం అండగా ఉందామని ఆయన పిలుపునిచ్చారు. నేటి యువత కూడా సైన్యంతో కలిసి పోరాడడానికి సిద్ధం ఉందని తెలిపారు.