calender_icon.png 13 January, 2026 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్లకు టెట్ కష్టాలు!

31-12-2025 12:00:00 AM

టీచర్స్ ఎలిజిబులిటి టెస్ట్ (టెట్) పరీక్షను జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడానికి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ టెట్ రాయబోతున్న అభ్యర్థులు.. ముఖ్యంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ జిల్లాలో కాకుండా సదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించడం, ఆ పరీక్షా కేంద్రాలు దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఒకరోజు ముందుగానే సెంటర్లకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పదో తరగతి పరీక్షల తేదీలు సమీపిస్తుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో టెట్ పరీక్షకు సరైన ప్రిపరేషన్ లేక టీచర్లు నానా అవస్థలు పడుతున్నారు. టెట్ పరీక్షలకు హాజరయ్యే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సదుపాయం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు.. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి, విద్యా సంబంధిత అధికారులును కోరుతున్నారు. అయితే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేయడం ఇన్ సర్వీస్ టీచర్లను మరింత ఆందోళనలో పడేసింది. ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలు గా, ఇతర ఉన్నతాధికారులుగా తీర్చి ది ద్దిన తమకు ఇప్పుడు ఉపాధ్యాయుడిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఒత్తిడి చేయ డం తగదంటున్నారు.

ఎన్నో ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్న భాషోపాధ్యాయులకు తమకు పట్టు లేని సాంఘిక శాస్త్రం, సైకాలజీ తెలుగులో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొనడం విచిత్రంగా ఉంది. ఇక బయాలజీ ఉపాధ్యాయులకు గణితం, ఇంగ్లీష్, భౌతిక శాస్త్రంలో టెట్‌ను నిర్వహించాలని, రాబోయే రెండు సంవత్సరాల్లోపూ ఉత్తీర్ణత సాధించకుంటే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఉత్తర్వులను జారీ చేయడం దేశ వ్యాప్తంగా డ్బ్బు వేలకుపైగా ఉపాధ్యాయులను ఇరకాటంలో పడేసినట్లయింది. సంబంధం లేని సబ్జెక్టులో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించకపోతే తమ పరిస్థితి ఏంటని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు బాధపడుతున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లలో  50 ఏళ్లు దాటిన వారే ఎక్కువగా ఉన్నారు.

మరో పదేళ్లలో రిటైర్ అవ్వబోతున్న సమయంలో టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని ఒత్తిడి పెంచుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనేక రాష్ట్రాల ఎంపీలు కూడా టెట్ గురించి ప్రస్తావిస్తూ ఏ ఉద్యోగస్తులకు లేని అర్హత పరీక్ష ఉపాధ్యాయులకు పెట్టడం సరికాదన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. 2011 తర్వాత టీచర్లుగా ఎంపికైన వారికి మాత్రమే టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి చేయాలని పేర్కొన్నాయి. అయితే టెట్ పరీక్ష రాయబోతున్న అభ్యర్థులకు వారి సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

 ఎస్.విజయభాస్కర్