13-01-2026 09:28:37 PM
- ఉమ్మడి వరంగల్ ఎన్నికల ఇంచార్జ్ మాదిరెడ్డి దామోదర్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేనపార్టీ పోటీ చేస్తుందని జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల ఇంచార్జ్ మాదిరెడ్డి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్నీ మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న జనసేన పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతుందని తెలిపారు.
ప్రజలకు జవాబుదారీతనం కలిగిన పాలన అందించడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యనించారు.గెలుపే లక్ష్యంగా జనసైనికులు పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.పార్టీ యువజన విభాగం రాష్ట్ర అడ్ హాక్ కమిటీ సభ్యులు,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గాదె పృథ్వీ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సంస్థాగతంగా బలోపేతమైందని, మున్సిపల్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. యువత, మహిళలు, సామాన్య ప్రజల సమస్యలను ఎన్నికల అజెండాగా తీసుకుని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.