calender_icon.png 13 January, 2026 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డోలాయమానంలో శాంతి!

31-12-2025 12:00:00 AM

ఒకవైపు శాంతి ప్రస్తావనకు కట్టుబడి ఉన్నామని పేర్కొంటూనే.. మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పరం దాడులు చేసుకోవడాన్ని మాత్రం ఆపడం లేదు. తాజాగా సోమవారం రష్యాలోని నోవ్‌గొరొడ్ ప్రాంతంలో ఉన్న దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులకు పాల్పడడం నివ్వెరపరిచింది. అత్యంత పటిష్టమైన భద్రత కలిగి ఉండే పుతిన్ నివాసాన్ని టార్గెట్ చేస్తూ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడులు జరిపిందని రష్యా విదేశాంగశాఖ మంత్రి లవ్రోవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి నివాసంపై దాడి జరగడంతో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చే ప్రమాదం లేకపో లేదు.

అయితే పుతిన్ ఇంటిపై దాడిని ఉక్రెయిన్ ఖండించింది. శాంతి చర్చలను దెబ్బకొట్టేందుకు రష్యా కొత్త డ్రామా మొదలుపెట్టిందని పేర్కొంది. అయితే ఇటీవల క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ తన సామాజిక మాద్యమం ‘ఎక్స్’ వేదికగా పుతిన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా..‘ నాకు ఒక కోరిక ఉంది. ఆ వ్యక్తి చనిపోతేనే యుద్ధానికి ముగింపు ఉంటుందేమో’ అని ట్వీట్ చేయడం శాంతి చర్చలకు విఘాతం కలిగించినట్లుగా అనిపిస్తున్నది. అంతకుముందు రోజే రష్యా తమ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసి ముగ్గురు వ్యక్తులను చంపడంతో పాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడేలా చేసింది.

ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై నాలుగేళ్లు గడుస్తున్నా పరిస్థితి మాత్రం సద్దుమణగడం లేదు. ఇప్పటికీ రష్యా, ఉక్రెయిన్‌లు ఒకరిపై ఒకరు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, భారీ షెల్లింగ్‌లతో దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. కాగా పరస్పర దాడుల్లో ఇప్పటివరకు రెండు దేశాల్లో సైన్యంతో కలిపి దాదాపు నాలుగు లక్షల మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28న ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీతో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ట్రంప్ తొలుత ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికను పక్కనబెట్టిన జెలెనెస్కీ తన 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చలు జరిపారు. యుద్ధానికి ప్రధాన కారణమైన డాస్‌బాస్ ప్రాంతం అప్పగింత సహా కొన్ని కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు.

వీటిలో రష్యా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను ఆ దేశ ఆధీనంలోనే ఉంచడం, భవిష్యత్తులో మాస్కో మళ్లీ ఆక్రమణకు దిగకుండా ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు ఇవ్వడం, రష్యా ఆక్రమించిన జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు వంటి అంశాలు ముఖ్యమైనవి. కాగా శాంతికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే పుతిన్ నివాసం లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేసిందన్న వార్త బయటికి వచ్చింది. యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో ఇలాంటి దాడులు చేయడం సరైన పద్దతి కాదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పుతిన్ నివాసంపై దాడిని ఖండించారు. దౌత్య మార్గాల ద్వారా శాంతిని సాధించాలని పిలుపునిచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరితేనే దాడులు ఆగుతాయేమో చూడాలి!