calender_icon.png 11 July, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం!?

09-07-2025 12:00:00 AM

  1. సిగాచీ ఘటనపై ఎన్డీఎంఏ బృందం ప్రాథమిక నిర్ధారణ

పేలుడు ఘటనపై సభ్యుల నిశిత పరిశీలన

ప్రశ్నలకు జవాబు చెప్పని యాజమాన్యం

44కు చేరిన సిగాచీ మృతుల సంఖ్య

సంగారెడ్డి, జూలై 8 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనకు కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) బృందం ప్రాథమిక అంచనాకు వచ్చింది. మంగళవారం ఎన్డీఎంఏ బృందం సిగాచీ పరిశ్రమ ను పరిశీలించింది. పేలుడుకు గల కారణాలను అన్వేషించింది.

అనంతరం అక్కడే సమావేశం నిర్వహించి యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇందుకు యాజమాన్యం సరియైన సమాధానాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రసాయన పరిశ్రమల నిర్వహణ ఎలా ఉంటుందో తమకు తెలుసని, పేలుడుకు గల కారణాలు ఏమిటో స్పష్టం చేయాలని నిలదీయగా కంపెనీ అధికారుల నుంచి సరియైన స్పందన రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పేలుడు ఘటనకు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణే ప్రాథమిక కారణమని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. 

నిశితంగా పరిశీలించిన బృందం

సిగాచీ ఫార్మా కంపెనీలో ఎన్డీఎంఏ బృందం సభ్యులు నిశితంగా పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధ్యయనం చేశారు. ఇలాంటి ఘటనలు పరిశ్రమలలో పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు.

ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పరిశ్రమల శాఖ, అగ్ని మాపక శాఖ, కార్మిక శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులుపాల్గొన్నారు.

44కు చేరిన మృతుల సంఖ్య

పాశమైలారం సిగాచీ పేలుడు ఘటనలో మంగళవారం నాటికి మృతుల సంఖ్య 44కు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. పటాన్‌చెరులోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్న అఖిలేశ్వర్, బీరంగూడలోని పనేషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరీఫ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

దీంతో సిగాచి ఘటనలో 44 మంది మత్యువాత పడ్డారు. కాగా జాడలేని 8 మంది కార్మికుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఇప్పటికే 70కి పైగా అవశేషాలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపిన విషయం తెలిసిందే.