15-01-2026 01:48:22 AM
నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మారి దర్శకుడిగా పరిచయ మైన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. బుధవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట ఫలితం అనంతరం చిత్రబృందం సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర కథా నాయకుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా అంతా నవ్వుతూనే ఉన్నారు ప్రేక్షకులు. క్లైమాక్స్‌లో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు” అని చెప్పారు. కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “మా సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది.
ఈ ఫలి తం మా అందరి కష్టాన్ని మర్చిపోయేలా చేసింది. నేను పోషించిన చారులత పాత్ర బాగుందని అందరూ ప్రశంసించడం ఆనందంగా ఉంది. నటిగా ఇది ఛాలెంజింగ్ పాత్ర. మొదటిసారి ఇలాంటి క్యూట్ మాస్ కామెడీ చేశాను. సంక్రాంతి పండుగకు నేను నటించిన సినిమా విడుదలై విజయం సాధించడం నాకు మరింత ఆనందాన్నిచ్చింది” అని తెలిపింది. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమాపై ముందు నుంచి నమ్మకంగా ఉన్నాం. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ప్రేక్షకులు సినిమాలో కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో.. అంతకన్నా ఎక్కువ చివరిలో ఎమోషన్‌కి కనెక్ట్ అవుతున్నారు” అన్నారు.
సినిమా సమీక్ష
‘అనగనగా ఒక రాజు’.. నవ్వుల రారాజు
ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టారు హీరో నవీన్ పొలిశెట్టి. బుధవారం విడుదలైన ఈ సినిమాను సంక్షిప్తంగా సమీక్షిద్దాం.. రాజు (నవీన్ పొలిశెట్టి) తాత గోపరాజు ఓ జమీందార్. ఆయన ‘మహిళాభివృద్ధి కామికుడు’! ఆ కారణంగా వారసత్వ ఆస్తులేమీ మిగలవు. పేరుకే జమీందార్ వారసుడైన రాజు గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంటాడు. ఆర్థిక కష్టాల్లో బతుకీడుస్తూనే, డబున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని, జీవితంలో స్థిరపడిపోవాలనుకుంటాడు. ఓ సారి జాతరలో చారులత (మీనాక్షి చౌదరి)ను చూసి ఆమెను జీవిత భాగస్వామిని చేసుకుంటే కష్టాలన్నీ తొలగిపో తాయని భావిస్తాడు.
ఇందుకోసం ఆయన చేపట్టిన ‘ఆపరేషన్ చారులత’ పథకం ఫలించిందా? రాజు జీవితంలోకి చారులత వచ్చిందా? తన జీవితంలోకి చారులత రాకతో ‘దలిందర్ రాజు’ కాస్తా మళ్లీ జమీందార్ రాజుగా మారాడా..? ఆర్థిక కష్టాలు తీరితే చాలనుకున్న రాజు అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎందుకు అడుగుపెట్టాల్సి వచ్చింది..? వంటి ఆసక్తిర విషయాలతో సాగుతుందీ కథ. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైనదే. అయినప్పటికీ రాజు పాత్ర చేసే హంగామా.. ప్రేక్షుకులు పైసా వసూల్ కామెడీ అనేలా ఉంటుంది. నవీన్ తనదైన మార్క్ టైమింగ్‌తో వన్‌మేన్ షోలా సినిమాను ముందుకు నడించారు. రొటీన్ సన్నివేశాలే అయినా డైలాగులు పేలాయి. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. చారులతగా మెప్పించిన మీనాక్షి పాత్రకు ప్రాధాన్యం దక్కింది. రావు రమేశ్ పాత్ర ఆకట్టుకుంటుంది. చమ్మక్ చంద్ర, ‘రంగస్థలం’ మహేశ్, ‘బుల్లి రాజు’ రేవంత్ నవ్వులు పండించారు. ఫరియా అబ్దుల్లా సర్‌ప్రైజ్ పాత్రలో పలుకరించింది. మొత్తంగా ‘అనగనగా ఒక రాజు’.. ఈ పండక్కి నవ్వుల రారాజు అని చెప్పొచ్చు.