17-07-2024 12:05:00 AM
సీనియర్ హీరోయిన్ సమంత నిరుడు వచ్చిన ‘ఖుషి’ తప్ప మరే చిత్రంలోనూ నటించలేదు. సామ్ గతంలో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమాను కూడా సమంత ప్రకటించింది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న కారణంగా కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకున్నది. ప్రపంచంలో తనకు ఇష్టమైన చోటు కెమెరా ముందు నిల్చోవడమేనని చెప్పిన సామ్.. త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్నానంటూ తన కెరీర్ మళ్లీ పట్టాలెక్కబోతున్న విషయాన్నీ వెల్లడించింది.
తాను అనుభవిస్తున్న ఆధ్యాత్మిక జీవిత విశేషాల గురించి చెప్తూ.. ‘చాలా మంది జీవితంలో మార్పు కోరుకుంటాం. కానీ, అది సాధ్యమయ్యే పని కాదు. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. ఆ స్ఫూర్తే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. గత మూడేళ్లలో నేను కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. అయితే, ఆధ్యాత్మికత నాలో మంచి మార్పును తెచ్చింది. ఆధ్యాత్మికపరమైన జీవితం వ్యక్తిగతంగానే కాక వృత్తిపరంగానూ నాపై ప్రభావం చూపింది. మునుపటి కంటే ఇప్పుడు నేను మానసికంగా దృఢంగా మారాను. ఒకప్పటితో పోల్చితే.. ఇప్పుడు చాలా మంది చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు.
తద్వారా మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. శక్తినిచ్చే ఆధ్యాత్మిక మార్గంలో నడవటం అవసరమని నేను నమ్ముతాను’ అని వివరించింది. ఆ తర్వాత ‘నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే నిత్య విద్యార్థిని అని చెప్తా.. ఇండస్ట్రీలో ఇప్పుడు మహిళలు మంచి క్యారెక్టర్లు, పూర్తిస్థాయి పాత్రలు అడిగే పరిస్థితి నెలకొంది. అయితే, మూసధోరణిలో కాకుండా, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు విభిన్న చిత్రాలను అందించాలన్నదే నా లక్ష్యం.
కెరీర్ ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా నేనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను కొత్త స్కిల్ నేర్చుకునే అవకాశం ఉన్న స్టోరీలనే ఎంపిక చేసుకుంటున్నా. త్వరలో నటించనున్న సినిమాలోని నా పాత్రకు సంబంధించి హార్స్ రైడింగ్, ఆర్చరీ వంటి అంశాల్లో శిక్షణ తీసుకుంటున్నా. వచ్చే నెలలో కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటా.