13-09-2025 07:27:59 PM
ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్
నిజామాబాద్ (విజయక్రాంతి): హిందూ సమాజానికి మూలమైన ఆధారం కుటుంబ వ్యవస్థ మాత్రమేనని అందుకే ఆదర్శ హిందూ కుటుంబంగా మన యొక్క కుటుంబాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ వ్యాఖ్యానించారు. ఇస్కాన్ కంటేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో చిన్నాపూర్ లో గల అర్బన్ పార్కులో నిర్వహించిన ఇస్కాన్ కుటుంబ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన దేశం భారతదేశం అని, మానవ సంబంధాల యొక్క విలువను ప్రపంచానికి చాటిచెప్పిన సంస్కృతి మన హిందూ సంస్కృతి అని అటువంటి సంస్కృతిని భారతీయులు మరిచిపోయి విదేశీ విష సంస్కృతి మోజులో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఇస్కాన్ తనదైన శైలిలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు హిందూ సంస్కృతి యొక్క మాధుర్యాన్ని తెలియజేస్తున్నదని, భజన కీర్తన కథ కథనం వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఇస్కాన్ కొన్ని కోట్ల హిందూ కుటుంబాలలో సంస్కారాలను నింపిందని గుర్తు చేశారు.
భోగవాదంతో నిండిపోయిన విదేశాలలో సైతం ఇస్కాన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల కోట్లాదిమంది హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నారని ఇది గర్వించదగ్గ విషయమని శివకుమార్ తెలిపారు, ఆర్ఎస్ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా ఈ విజయదశమి నాటు నుంచి మొదలుపెట్టి 2026 విజయదశమి వరకు వస్తి ఆధారంగా హిందూ సమాజాన్ని జాగ్రత్తలు చేసే వివిధ కార్యక్రమాలను రూపొందించినట్టు తెలిపారు. సంవత్సర కాలం పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని వయసుల వారు కుటుంబ సమేతంగా పాల్గొని హిందూ సమాజం యొక్క జాగృతి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. మన ధర్మాన్ని మనం తెలుసుకోనంత కాలము మనం చీకట్లోనే ఉండిపోతామని ఆయన హెచ్చరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ఇస్కాన్ భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కంటేశ్వర అధ్యక్షులు రామానంద రాయ్ ప్రభు దాస్, బిజెపి నాయకులు మాదాస స్వామి యాదవ్, రమణ గోపేస్ ప్రభు, నీతాయచంద్ ప్రభు, బలరాం ప్రభు, ప్రాణప్రియ ప్రభు, సర్వనాథ ప్రభు, రాధా రాజా గోపిక ప్రభు, సునీల్ ప్రభు జి, గంగారం ప్రభుజి, రోహిత్ ప్రభు జి, సుగోపి మాలతీ దేవి, సత్య వ్రత దేవి, సనాతని గోపేశ్వరి, మా సుందరీ దేవి తదితరులు పాల్గొన్నారు.