23 April, 2026 | 3:14 AM

సీబీఐ విచారణ ఏమైందో బీజేపీ చెప్పాలి

23-04-2026 01:59 AM

కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ రిపోర్టును హైకోర్టు తప్పుపట్టలేదని, కానీ, బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారో ఆర్థం కావడం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ సంబురాలు చేసుకునే విధంగా కోర్టు తీర్పులో ఏముందన్నారు. హైకోర్టు తీర్పు కాపీలు వచ్చి న తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మేడిగడ్డ పిల్లర్లు కుంగిన తర్వాత అధికారులు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని కమిషన్ రిపోర్టులో ఉందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సైతం ఇదే అంశాన్ని చెప్పిందని ఎంపీ చామల తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ చేయాలని ప్రభుత్వం అడగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీకి బాధ్యత పెరిగిందన్నారు.

కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్ పార్టీకి క్లిన్ చిట్ వచ్చిందా లేదా అనేది చెప్పాలన్నారు. పీసీ ఘోష్ కమీషన్ రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మాకు క్లిన్ చిట్ ఇవ్వాలని హరీశ్‌రావు ఢిల్లీలో ఏమైనా మంతనాలు చేశారా..?అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.