03-01-2025 12:00:00 AM
భూమిని ఆరాధించిన మహర్షి ఐతరేయులు. అందువల్ల ఇది ఐతరేయ ఉపనిషత్తుగా ప్రసిద్ధమైంది.
‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అన్న మహావాక్యం ఈ ఉపనిషత్ అనుగ్రహించిందే. లోకం, మనిషి, మనసు, ఆహారం, మనిషిలో సంస్థితుడైన భగవంతుడు చైతన్యరూపంలో ఉన్నాడనే విషయాలను వివరించే ఈ ఉపనిషత్ ఆపాతమధురం!
ఆకాశం, భూమి రెండింటి మధ్యా మరొకటిగా మూడు లోకాలను సృష్టించింది పరమాత్మ! ప్రధానంగా భూలోకం, అందులో ప్రముఖుడైన మనిషి మూడు చైతన్య క్షేత్రాలతో విరాజిల్లుతున్నాడు. అవి హృదయం, మెదడు, కంఠం. అవే చైతన్య క్షేత్రాలు! శిశుజననాన్ని, తదనంతర పరిణామాలను విస్పష్టంగా వివరించే ఈ ఉపనిషత్తు మహర్షుల విజ్ఞాన దర్శనానికి అద్దం పడుతుంది. తల్లి తన గర్భంలో ఉన్న పిండాన్ని రక్షిస్తుంది, తండ్రి ఆపై సంరక్షిస్తాడు. ఈ బంధమే అనుబంధమై కుటుంబ, సామాజిక బంధాలను సక్రమంగా నడిపిస్తుంది. అధ్యాత్మపరంగా ఆలోచిస్తే, ‘శరీరంలోకి ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది?’ అన్న ప్రశ్నకు ఈ ఉపనిషత్తు సమాధానం చెబుతుంది.
ఆత్మ, మానవ శరీరంలోకి శిరస్సుద్వారా ప్రవేశిస్తుంది. మెదడు ద్వారా జ్ఞానశక్తిగా, పాదాల నుంచీ ప్రాణశక్తిగా ప్రవేశించి, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల రూపంలో మనిషిని అద్భుత శక్తి స్వరూపంగా నడిపిస్తుంది. సృష్టికి ముందున్నది మహా శూన్యమే! ఇది జడ చైతన్యాల సంగమం.
అదే లోకంగా ఆవిర్భవించింది. ప్రాణం, దాంతోపాటు ఇంద్రియాలు, వాటి కార్యకలాపాలు ఒకదాని వెంట మరొకటి ఏర్పడినయ్. సర్వాంగీణ దేహంతో సమగ్ర స్వరూపంగా మనిషి ఆవిష్కరించబడ్డాడు! వెనువెంటనే ఆకలి పుట్టింది. అప్పటికే ఆహారం పుట్టింది. వీటన్నిటి చుట్టూ వ్యవస్థ ఏర్పడింది. దీంతో మానవ సమాజం తన ప్రయాణాన్ని ప్రారంభించింది.