calender_icon.png 26 January, 2026 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ స్కిల్స్ ఉండాలి!

02-01-2025 12:00:00 AM

2024 నుంచి 2025లోకి వచ్చేశాం.. ఈ ఏడాది యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు రెండే రెండు.. ఒకటి వ్యక్తిగత ఎదుగుదల, రెండోది వృత్తిపరమైన ఎదుగుదల. ఈ రెండు చాలా అవసరం. వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో టీనేజర్లు ఒత్తిడిని జయించి.. సక్సెస్ సాధించాలంటే కేవలం మార్కులు, ర్యాంకులు, సోషల్ మీడియాలో లైకులు, ఫాలోయింగ్‌లు మాత్రమే సరిపోవు. వాటిని మించిన స్కిల్స్ అవసరం అంటున్నారు ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ మృదుల. అవేమిటో చూద్దాం.. 

ప్రస్తుతం.. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు మధ్యలో ఉన్న వయసులో ఉన్నవాళ్లు టీనేజర్లు. ఈ క్రమం ఎలా ఉంటుందంటే.. వాళ్లకు వాళ్లుగా ఈ ప్రపంచాన్ని ఎలా ఎదుర్కొవాలో.. వాళ్లకు వాళ్లు ప్రిపేర్ అవుతుంటారు. ఈ ప్రిపరేషన్‌లో వాళ్లకు ముఖ్యమైనది ఏంటంటే.. వ్యక్తిగత ఎదుగుదల.

వ్యక్తిగతంగా ఎలా వృద్ధిచెందాలంటే.. ప్రవర్తన, విలువలు, నీతి, నిజాయితీ, కుటుంబం అంటే ఏంటి? రిలేషన్‌షిప్ అంటే ఏంటి? ఒక బాధ్యతగల పౌరుడిగా దేశానికి ఎలా ఉపయోగపడతాను? సెల్ఫీష్‌గా ఉండకుండా.. సెల్ఫ్ లవ్‌తో.. ఎలా మెలాగాలో టీనేజ్‌లో నేర్చుకుంటారు. వీటిని మూలం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీన్ని అర్థం చేసుకుంటే.. ఒక మంచి పద్ధతిలో విజయాలను అందుకుంటారు. 

క్రమశిక్షణ

సెల్ఫ్ డిసిప్లిన్.. క్రమ శిక్షణ అంటే తాత్కాలిక టెంప్టేషన్స్‌ను అర్థం చేసుకుని నియంత్రించడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడం, వ్యక్తిగత విలువలను అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇది అకాడమిక్ సక్సెస్‌కు మాత్రమే కాదు, వ్యక్తిగత వికాసానికీ అనివార్యమైన నైపుణ్యం.

అలాగని నియమాలూ, నిబంధనల పేరుతో బలవంతాన క్రమశిక్షణను అమలుచేస్తే.. అది కొద్ది రోజులే పనిచేస్తుంది. కానీ స్వీయ క్రమ శిక్షణ, స్వీయ అవగాహన అలవాటుగా మార్చుకుంటే విజయాలెన్నో సాధించవచ్చు. ఊహించని సవాళ్లూ, అనుకోని ఆపదలు స్వీయ క్రమశిక్షణకు ఆటంకంగా నిలుస్తాయి.

అలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలనే దానిపైనా అవగాహన ఉం డాలి. వాటిని అధిరోహించడానికి తగిన ప్రణాళికనూ సిద్ధం చేసుకోవాలి. దీంతో ఎలాంటి సవాళ్లు ఎదురైనా క్రమశిక్షణకు భంగం కలగకుండా చూసుకోవచ్చు. అలాగే సంకల్ప బలం తోనూ స్వీయ నియంత్రణ అలవడుతుంది.

స్వీయ క్రమశిక్షణ అనేది గమ్యం దిశగా చేసే ప్రయాణం లాంటిది. మధ్యలో కొన్ని ఆటంకాలు వస్తే అధిగమించడానికి ప్రయత్నిస్తాం. అప్పుడప్పుడూ మనకు లభించే విజయాలు చిన్నవైనా, పెద్దవైనా, ఆనందించడం నేర్చుకోవాలి. ఈ ధోరణి సానుకూల ఆలోచనలను పెంచుతుంది. ఇదే దృక్పథాన్ని కొనసాగిస్తే అనుకున్నది సాధిస్తారు కూడా.  

స్వీయ నియంత్రణ

జీవితంలో అనుకున్న రీతిలో విజయం సాధించాలంటే నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవితాన్ని అనుసరించాలి. స్వీయ నియంత్రణ అనుకున్నప్పుడు ప్రతిఒక్కరు ఎంత సమయాన్ని కార్యసాధన కోసం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాడనేది ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. కాసేపు మొక్కుబడిగా పనిచేసి, అనుకున్న ఫలితం రాలేదని భావించడంవల్ల ప్రయోజనం ఉండదు.

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు ఎటువంటి దురలవాట్లకూ బానిస కాకుండా ఉండటం స్వీయ నియంత్రణలో అంతర్భాగం. ముందుగా తనను తాను సరిచేసుకుని.. సానుకూలమైన ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలి. మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలకూ చోటు ఇవ్వకూడదు.

అలాగే మనకున్న ప్రత్యేకమైన స్కిల్స్ ఏమైతే ఉన్నాయో.. వాటిని ఎక్కడ? ఎప్పుడు? ఎంతవరకు ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి. దాన్ని స్వీయనియంత్రణ అంటారు. 

ఎమోషనల్ ఇంటెలిజెన్స్

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తన భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియం త్రించుకోవడం, అలాగే ఇతరుల భావాలను అంగీకరించడం. కౌమరంలో భావోద్వేగాలు చాలా వేగంగా మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఐక్యూ అవసరం.

తమ బంధాలను నిలబెట్టుకోవడంలో, ఒత్తిడిని నిర్వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఐక్యూను అభివృద్ధి చెసుకున్న టీనేజర్లు ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పరచుకుంటారు. వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. 

కెరీర్‌పై ధ్యాస..

స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా వర కు టీనేజర్లను పక్కదారి పట్టించే అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకుని చదువుపై, కెరీర్ పై ధ్యాస నిలపాలంటే టైమ్ మేనేజ్‌మెంట్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిం దే.

తమ పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ప్రణాళికలను రూపొందించుకుని, లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్చుకున్న టీనేజర్లు తమ బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటారు. ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా తమ లక్ష్యాలను సాధిస్తారు. 

క్రిటికల్ థింకింగ్

ఈ రోజుల్లో సమాచారం సులువుగా లభిస్తోంది. అందులో ఏది నమ్మదగినదో, ఏది కాదో చెప్పలేం. అందుకే క్రిటికల్ థింకింగ్ అవసరం. ఇది టీనేజర్లలో స్వతంత్రతను పెంచుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అనుసరించకుండా, విశ్వేషించి, వివిధ కోణాలను అంచనా వేసి, సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే టీనేజర్లు ఈ స్కిల్‌ను అలవరు చుకోవడం చాలా ముఖ్యం, అవసరం. దీనివల్ల వారు చదువులో, జీవితంలో మెరుగైన అవకాశాలను ఎంచుకుంటారు. 

కమ్యూనికేషన్ స్కిల్స్

మానవ సంబంధాలు ఏర్పరచుకోవడంలో, సక్సెస్ సాధించడంలో కమ్యూనికేషన్స్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇతరుల చెప్పేది సరిగా వినడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం, ఉపయుక్తమైన సంభాషణలు నెరవడం వంటివి నేర్చుకో వడం టీనేజర్లకు అత్యవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీనేజర్లు మంచి సంబంధాలు ఏర్పరచుకోవగలుగారు. గ్రూప్ డిస్కషన్స్‌లో బెరుకులేకుండా పాల్గొ నగలుగుతారు. ఇది బడి, పని లేదా సామాజిక వాతావరణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. 

ఫైనాన్షియల్ లిటరసీ

పిల్లల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ రావాలంటే.. చిన్నప్పటి నుంచి పిల్లలతో ఆర్థిక అంశాల గురించి మాట్లాడుతుండాలి. వాళ్లు చేసే ప్రతిపనిలోనూ విలువను (మూలాన్ని) ఎలా చూడాలి? అని నేర్పించాలి. క్రమశిక్షణ నేర్పించేటప్పుడు చిన్నచిన్న ఒప్పందాలు ఉంటాయి. అవి అర్థమయ్యేటట్టు నేర్పించాలి.

చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్టు వింటారు. కొంచెం పెద్దయ్యేక ప్రశ్నించడం మొదలెడుతారు. అది క్యూరియాసిటీ. అది మంచి గుణం. పిల్లలు వేసే ప్రశ్నలకు లాజికల్‌గా, అర్థమయ్యేలా వివరించాలి. ఆర్థిక అంశాలను వివరించడంలో నిర్లక్ష్యం చేయొ ద్దు.

దాంతో ఆర్థిక చిక్కుల్లో పడతారు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పులను మేనేజ్‌చేయడం వంటివి టీనేజ్‌లోనే నేర్చుకుంటే ఆ తర్వాత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగించుకునేవారు త్వరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. 

---- డాక్టర్ మృదుల కపిల 

ప్రముఖ సైకాలజిస్టు లైఫ్ స్కిల్స్ 

మెంటరింగ్ అకాడమీ చైర్మన్