6 May, 2026 | 4:00 AM

బీఆర్‌ఎస్ పదేండ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసింది

06-05-2026 02:38 AM

ఖజానాను ఖాళీ చేయడం తప్ప ఏంచేయలే

కేరళంలో విజయం రాహుల్ నాయకత్వానికి నిదర్శనం

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

కట్టంగూరు, మే 5: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. మంగళవారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటితో పాటు ప్రజల సౌకర్యార్థం రూ.20 లక్షలతో నిర్మించనున్న ప్రజా మరుగుదొడ్ల పనులకు సైతం భూమి పూజ నిర్వహించారు. ఖజానాను ఖాళీ చేయడం తప్ప గత పాలకులు పట్టణ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.

మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిజమైన ప్రజా పాలన మొదలైందని, అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలో ఎక్కడైనా డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని, తక్షణమే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

నకిరేకల్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయంపై ఎమ్మెల్యే వీరేశం స్పందిస్తూ.. ఈ విజయం రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ విజయంలో సగం క్రెడిట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.