25 February, 2026 | 4:26 AM

తలపైన బతుకు భారం.. ఒడిలో పసిపాప ప్రాణం..

25-02-2026 01:03 AM

వలస జీవుల ‘కన్నీటి’ పోరాటం!l

మొయినాబాద్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): ఆకాశమంత ఆశతో నగరం వైపు అడుగులు.. కానీ ఆ అడుగుల కింద మండుతున్న వాస్తవాలు. తలపై పెనవేసుకున్న సామాను మూట, నడుముకు ఆనించుకున్న పసికందు, కళ్లలో రేపటి గురించిన అభద్రత.. ఇది ఒక వలస కార్మిక మహిళ దీనగాథ మాత్రమే కాదు, వేల కుటుంబాల నిత్యకృత్యం. మొయినాబాద్ మీదుగా వెళ్తున్న ఒక వలస కార్మిక కుటుంబం పడుతున్న తపన స్థానికుల కళ్లను చెమర్చింది.

సొంత ఊరిలో ఉపాధి కరువై, కడుపు నింపుకోవడానికి వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి చేరుకుంటున్న ఈ ’అభాగ్యుల’ ప్రయాణం ముళ్లబాటను తలపిస్తోంది.కూలి దొరికిన చోటే వీరికి ఇల్లు...ప్లాస్టిక్ పట్టాలు, రేకుల షెడ్లే వీరి విలాసవంతమైన భవనాలు. తల్లులు పనులక వెళ్తే, పసిపిల్లలు దుమ్ములో, ఎండలో నిర్మాణ ప్రాంతాల్లోనే పెరుగుతున్నారు. వీరి చదువు, సంధ్య ప్రశ్నార్థకంగా మారుతోంది. సరైన ఆహారం, స్వచ్ఛమైన నీరు అందక పోషకాహార లోపంతో ఈ కుటుంబాలుసతమతమవుతున్నాయి.

సామాజిక బాధ్యత ఎక్కడ?...

వలస కార్మికులు కేవలం ’శ్రమశక్తి’ మాత్రమే కాదు, వారు కూడా ఈ దేశ పౌరులేనని సామాజిక కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు తేవాలని కోరుతున్నారు. ‘భవనాలు నిర్మించేది వీరే.. కానీ వీరికి నిలువనీడ ఉండదు. రోడ్లు వేసేది వీరే.. కానీ వీరి ప్రయాణం ఎప్పుడూ కష్టాలతోనే సాగుతుంది. వీరి పిల్లలకు అంగన్వాడీ సౌకర్యాలు, ప్రాథమిక విద్య అందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత.స్థానిక సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

పట్టణాల్లో వలస కార్మికుల కోసం మొబైల్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని,వలస ప్రాంతాల్లోనే పిల్లల కోసం ప్రత్యేక బడులు, మొబైల్ క్లినిక్లు నిర్వహించాలని, వీరికి రేషన్ కార్డులు, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఇతర ప్రాంతాల్లో కూడా వర్తించేలా  ప్రభుత్వంచర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ దృశ్యాలు మనల్ని ఆలోచింపజేయాలి....ఆ తల్లి తలపై ఉన్నది కేవలం సామాను కాదు.. రేపటి తరం భవిష్యత్తు. ఆ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.