18 April, 2026 | 5:01 AM

ఓరుగల్లులో అందగత్తెల సందడి

15-05-2025 12:39 AM
  1. రామప్ప, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట సందర్శన
  2. వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా రాక
  3. తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రధారణ
  4. చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఓరుగల్లు: కొండా సురేఖ
  5. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు

వరంగల్, మే 14 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్‌వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి అందగత్తెలు హాజరైన విషయం తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన 5౦మందికి పైగా పోటీదారులు బుధవారం చారిత్రక ఖ్యాతి గడించిన కాకతీయుల కాలంనాటి వరంగల్ నగరంలోని వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించారు.

జిల్లా మంత్రి కొండా సురేఖతోపాటు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు హరిత కాకతీయ హోటల్‌లో వారికి ఘనంగా స్వాగతం పలికారు.

సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు. తెలుగుదనం ఉట్టిపడే విధంగా సంప్రదాయ పద్ధతిలో వస్త్రధారణతో సుందరీమణులు దేవాలయాలను సందర్శించడం విశేషం.

రామప్ప ఆలయానికి వచ్చిన అందగత్తెలకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. రామప్ప దేవాలయంలో శిలలపై చెక్కిన శిల్పాలను చూసి భారతదేశ కళావైభవాన్ని, శిల్పకళా సంపదను, ఆధ్యాత్మికతను తెలుసుకొని ఆశ్చర్యంలో మునిగిపోయారు. కాకతీయ కళాతోరణం వద్ద ఫొటోలు దిగారు. వేయి స్తంభాల ఆలయ ఆవరణలో ఉన్న కోనేరును పరీశీలించారు. వేయి స్తంభాల దేవాలయం ప్రాశస్త్యాన్ని వివరించే శిలా శాసనాన్ని పరిశీలించారు.

శిలా శాసనంలో ఉన్న ఆలయ చరిత్రను గైడ్ వివరించారు. అనంతరం సాంప్రదాయ ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలం చెంబులో ఉన్న నీళ్లతో కాళ్లను కడుక్కున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అనంతరం కల్యాణ మంటపాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు.

లేజర్ కాంతులతో దేదీప్యమానంగా విద్యుత్‌దీప వెలుగులతో ఉన్న ఆలయ పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. ఆలయం వద్ద ఫొటోలు దిగారు. ప్రదక్షిణ తరువాత ఆలయంలో రుద్రశ్వర స్వామికి అభిషేకం చేసి, పూజలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాల్ని అందజేశారు.

వేయి స్తంభాల దేవాలయం సందర్శన అనంతరం సుందరీమణుల బృందం వరంగల్‌కు చేరుకొని, కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్‌ను సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత కాలంకారి దర్రీస్, జిఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు ప్రత్యేకతల గురించి తెలుసుకున్నారు.

కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి, శిల్పకళా నైపుణ్యానికి, నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఖిలిచిన వరంగల్‌ను కాకతీయులు అద్భుత నిర్మాణాలతో తీర్చిదిద్దిన తీరును, కోటలోని మూడు వృత్తాకార పొరలు భారీ రాతి ద్వారాలు (కీర్తి తోరణాలను) పరిశీలించి ఫొటోలు దిగారు.

తదనంతరం కాకతీయుల పాలనలో ఈ కోటలో అద్భుత నిర్మాణాలు, చరిత్ర, స్వయంభూ శివాలయం వంటి నిర్మాణాలు, ప్రాముఖ్యతలను సౌండ్ అండ్ లైట్ ద్వారా ప్రదర్శిస్తూ వివరించిన తీరును సుందరీమణులు తిలకించారు. యుద్ధ సమయంలో కాకతీయులు నిర్వహించే కళాకారులు ప్రదర్శించిన పేరిణి శివతాండవం నృత్య రూపకం, రాణి రుద్రమ నృత్య రూపకాలు చూసి మంత్రముగ్ధులయ్యారు.

ఇదిలా ఉండగా అందాలభామల రాక కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేయడంతో పాటు, ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి రామప్ప వరకు రహదారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 

ఓరుగల్లు సంప్రదాయాలకు నిలయం: మంత్రి సురేఖ

సుందరీణములు ఓరుగల్లును సందర్శించి సందర్భంగా జిల్లా మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా మాట్లాడారు. ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, చరిత్రకు నిలువెత్తు నిదర్శనమన్నా రు. మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు.

వరంగల్ భవ్య దివ్య నవ్య నగరంగా పేరు గాం చిందన్నారు. కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం, రమణీయ శిల్ప సౌందర్యం, అద్భుతమై ఆలయాలు, అలరించే రాజస కట్టడా లతో కొలువై ఉన్న నగరమన్నారు. త్రినగరిలో కొలువైన త్రికూటాలయం, వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకమని తెలిపారు.

వరంగల్ కోట కాకతీయ సామ్రా జ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గమని, కాకతీయులు అద్భుత నిర్మాణమని చెప్పారు. అందాల పోటీల్లో ప్రధాన ఆకర్షణలలో ఒకటి చేనేత వస్త్రాలని, పోటీ సమయంలో పోటీదారులు చేనేత దుస్తులను ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.